అర్జున్ రెడ్డితో టాలీవుడ్‌కి ఓ పూనకం తెప్పించేశాడు సందీప్ రెడ్డి వంగా. ఆ సినిమా చూసి చాలా మంది పెద్ద హీరోలు థ్రిల్లయిపోయారు. అందులో రామ్ చరణ్ కూడా ఉన్నాడు. అర్జున్ రెడ్డి చూసిన వెంటనే సందీప్ రెడ్డిని ఫోన్ చేసి అభినందించాడు. ఆ సమయంలోనే `నీతో సినిమా చేస్తా` అంటూ ఆఫర్ కూడా ఇచ్చాడు. ఇప్పుడు వీరిద్దరూ కలసి పనిచేయడానికి రంగం సిద్ధం అవుతోంది. రామ్ చరణ్ కోసం సందీప్ సరికొత్త జోనర్లో ఓ కథ సిద్ధం చేశాడు. చరణ్‌కి లైన్ కూడా వినిపించాడు. ఈ సినిమాని చరణ్ తన సొంత నిర్మాణ సంస్థలోనే తెరకెక్కించాలని భావిస్తున్నట్టు సమాచారం. ఇటీవల చరణ్ – సందీప్ ల మధ్య భేటీ కూడా అయ్యింది. అర్జున్ రెడ్డి తరవాత సందీప్ చేసే సినిమా ఏమిటన్నది ఇంకా కొలిక్కి రాలేదు. చరణ్‌తో సినిమా కంటే ముందు ఓ ప్రాజెక్ట్ పూర్తి చేసే ఉద్దేశంలో ఉన్నాడు సందీప్. చరణ్ ప్రస్తుతం రంగస్థలంతో బిజీ. ఆ తరవాత బోయపాటి శ్రీను సినిమా ఉంటుంది. రాజమౌళి మల్టీస్టారర్ కూడా పూర్తి చేయాలి. ఆ తరవాతే.. సందీప్ సినిమా పట్టాలెక్కొచ్చు.