మీడియాకి, మెగా కుటుంబానికి మధ్య పోరు రసవత్తరంగా సాగుతోంది. మెగా ఫ్యామిలీ హీరోలు, నిర్మాతలు మీడియాపై మూకుమ్మడిగా దాడి చేయడానికి కంకణం కట్టుకున్నట్టు ఒకరి తరవాత విమర్శల పర్వాన్ని కొనసాగిస్తున్నారు. పవన్ కల్యాణ్ రాజేసిన నిప్పు ఇంకా చల్లారలేదు. ‘నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా’ ప్రీ రిలీజ్ ఈవెంట్లోనూ అల్లు అరవింద్ పరోక్షంగా, రామ్ చరణ్ ప్రత్యక్షంగా విరుచుకుపడ్డారు. ‘నా పేరు సూర్య’కి మిక్స్డ్ టాక్ తీసుకురావడానికి, విమర్శించడానికి కొందరు ప్రయత్నిస్తున్నారని అల్లు అరవింద్ వ్యాఖ్యానిస్తే… ప్రేక్షకులు అమాయకులు కాదనీ, వాళ్లకు అన్నీ తెలుసుననీ, అర్థం చేసుకుంటారనీ రామ్ చరణ్ అన్నాడు.
ఇండస్ట్రీలో అవినీతి ఎక్కడుంది? అని ప్రశ్నించిన చరణ్, హీరోలు ఒక్కొక్కరూ ఒళ్లు హూనం చేసుకుని సినిమాలు చేస్తున్నారని చెప్పుకొచ్చాడు. అంతేనా? ఇంకా చరణ్ మాట్లాడుతూ “ప్రేక్షకులు అమాయకులు కాదు. వాళ్లకు అన్నీ తెలుసు. అర్థం చేసుకుంటారు. ఇండస్ట్రీ గురించి మీడియా రెండు నెలలుగా ఇష్టం వచ్చినట్టు రాస్తుంటే ఎంటర్టైన్మెంట్గా చూస్తారు తప్ప ఎవరూ వాటిని మనసులో పెట్టుకోరు. వుయ్ లవ్ మీడియా. మీడియా మాకు సపోర్ట్‌గా ఉంటుందని ఆశిస్తున్నాం. మీరు (అంటే మీడియా) హ్యాపీగా బతకండి. మమ్మల్ని (అంటే సినిమా ఇండస్ట్రీ, అందులో ప్రజలు) హ్యాపీగా బతకనివ్వండి” అన్నాడు. వుయ్ లవ్ మీడియా అంటూనే సెటైర్స్ వేశాడు. మాకు మీ సపోర్ట్ కావాలని అన్నాడు.
అంతకు ముందు అల్లు అరవింద్ చేసిన వ్యాఖ్యలను చరణ్ సమర్ధించాడు. “మామ (అల్లు అరవింద్) ఎప్పుడూ ఏదో ఒక కాంట్రవర్సీ మాట్లాడతాడు. మామ మాటల్లో బాధను నేను అర్థం చేసుకోగలను” అని మేనమామను చరణ్ వేసుకేసుకొచ్చాడు.
కొసమెరుపు: మెగా ఫ్యామిలీ ఏయే మీడియా సంస్థల మీద కత్తి కట్టిందో? ఏయే సంస్థల మీద పరోక్షంగా విమర్శలు చేసిందో? వాటిలో ‘నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా’ ప్రీ రిలీజ్ ఈవెంట్ లైవ్ కావడం విశేషం. వాటిలో లైవ్ టెలికాస్ట్ వుంటుందని మెగా ఫ్యామిలీకి ముందస్తు సమాచారం వున్నట్టుంది. అందుకని, సంస్థల పేర్లు ప్రస్తావించకుండా మీడియా అంటూ తాము చెప్పాలనుకున్న విషయాలను ప్రేక్షకులకు చేరువయ్యేలా జాగ్రత్తలు పడ్డారు. చెప్పేశారు.