రామ్ చరణ్ – శంకర్ కాంబినేషన్ లో ఓ సినిమా రూపుదిద్దుకుంటున్న సంగతి తెలిసిందే. కైరా అద్వాణీ కథానాయిక. ఇటీవలే క్లాప్ కొట్టారు. ఈ సినిమా టైటిల్ గానీ, కాన్సెప్ట్ కానీ బయటకు రాలేదు. `విశ్వంభర` అనే టైటిల్ ఈ సినిమాకి ఫిక్స్ చేశారన్న వార్తలు వస్తున్నాయి. కానీ అందులో ఎంత వరకూ నిజం ఉందో ఇంకా తెలీదు. సాధారణంగా శంకర్ సినిమాలన్నీ ఏదో ఓ బలమైన సామాజిక అంశంతో ముడిపడి ఉంటాయి. ఈ సినిమాలోనూ… అది తప్పనిసరి. మరి ఈ కథలో శంకర్ ఏం చెప్పబోతున్నాడన్నది ఆసక్తిగా మారింది.
ఈ సినిమాలో చరణ్ ఓ కలెక్టర్ గా కనిపించబోతున్నాడు. అంటే ఇది పొలిటికల్ బ్యాక్ డ్రాప్ లో నడిచే సినిమా అన్నమాట. అయితే… ఈ సినిమాతో శంకర్ మన భారతీయ చట్టాలపై అవగాహన కల్పించబోతున్నాడని తెలుస్తోంది. ఇండియన్ పీనల్ కోడ్ లోని కొన్ని కీలకమైన విషయాల్ని…అర్థమయ్యేలా చెప్పబోతున్నాడట. ఉదాహరణకు ఐపీసీ 211 సెక్షన్ గురించి `నాంది`లో చెప్పారు. నిజానికి అలాంటి సెక్షన్ ఒకటి ఉందని కూడా చాలామందికి తెలీదు. అయితే… శంకర్ మాత్రం.. ఒక్క సెక్షన్ చుట్టూనే కథ నడపడం లేదట. ఇలాంటి చాలా చట్టాల్ని శంకర్ పరిచయం చేయబోతున్నాడు. కార్పొరేట్ వ్యవస్థలు భారతీయ చట్టాల్ని అడ్డు పెట్టుకుని ఎలా ఎదుగుతున్నాయి? సామాన్యులు ఎలా నష్టపోతున్నారు? ఇలాంటి సున్నితమైన, విలువైన విషయాల్ని శంకర్ ఇందులో చర్చించబోతున్నాడని తెలుస్తోంది.