“మంచి సినిమాల వల్ల, మంచి క్యారెక్టర్స్ వల్ల… ఒక వ్యక్తికి, హీరోకి ప్రేమ, ఆదరణ రావు. ‘ఖైదీ నంబర్ 150’తో నాన్నగారు సినిమాల్లోకి తిరిగి వచ్చినప్పుడు గమనించగా నాకు అర్థమయ్యింది అదే. మనం పైకి ఎదిగేటప్పుడు మనతో పాటు పదిమందిని పైకి తీసుకువెళ్లాలి. ఎందుకంటే… ఒకవేళ మనం కిందకు పడిపోతే ఆ పదిమంది మనల్ని కాపాడతారు” అని హీరో రామ్చరణ్ అన్నారు. సినిమా ఇండస్ట్రీని, సినిమా హీరోలను కాపాడేది డిస్ట్రిబ్యూటర్స్, ఎగ్జిబిటర్స్ అని ఆయన వ్యాఖ్యానించారు. ‘రంగస్థలం’తో డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లకు లాభాలు రావడం సంతోషంగా వుందన్నారు. ప్రతి సినిమా లాభాలు తీసుకురావాలని ఆయన ఆకాక్షించారు. ఆదివారం రాత్రి హైదరాబాద్లో జరిగిన వంద రోజుల వేడుకలో రామ్చరణ్ ఈ వ్యాఖ్యలు చేశారు. ఇంకా ఆయన మాట్లాడుతూ “ఒక మనిషి ఆలోచన వెనుక సినిమా విజయం దాగుంటుంది. సుకుమార్ ఆలోచన ఈ సినిమా విజయానికి కారణం” అన్నారు.