‘సైరా నరసింహారెడ్డి’… పన్నెండేళ్లుగా చిరంజీవికి తెలిసిన కథే! పరుచూరి సోదరులు ఆయన ఇంటి గడప తొక్కిన ప్రతిసారీ గుర్తు చేస్తున్న కథే! ఆయనకు నచ్చిన కథే! కానీ, ఆ కథను అంతే సమర్థవంతంగా తెరకెక్కించే దర్శకుడు ఎవరు? ఈ మీమాంసతో పుష్కర కాలం కథను పక్కన పెట్టేశారు. చిరు తనయుడు రామ్ చరణ్ ముందడుగుతో ‘సైరా’ స్క్రిప్ట్ ముందుకు కదిలింది. ‘ధృవ’ తరవాత కథల వేటలో వున్న సురేందర్ రెడ్డికి పరుచూరి సోదరుల దగ్గర వున్న ‘సైరా’ కథ వినమని రామ్ చరణ్ చెప్పారట. తన సూచన మేరకు కథ విన్న సురేందర్ రెడ్డి వెంటనే సినిమా చేస్తానని ముందుకు రాలేదని చరణ్ తెలిపారు. కొన్ని రోజులు కథపై పరిశోధన చేసిన అతను కొన్ని మార్పులు చేర్పులతో మెగాస్టార్ ముందుకు వచ్చారట! “పన్నెండేళ్ళుగా ఈ సినిమా చేయడానికి ఆలోచిస్తున్న నాన్నగారు సురేందర్ రెడ్డి కథ చెప్పగా… సింగిల్ సిట్టింగ్లో ఓకే చేశారు” అని రామ్ చరణ్ తెలిపారు. టీజర్ విడుదల కార్యక్రమంలో పరుచూరి బ్రదర్స్, మాటల రచయిత సాయిమాధవ్ బుర్రా సినిమా చరిత్ర సృష్టిస్తుందని, అద్భుతమని కొనియాడారు.
సురేందర్ రెడ్డి చెప్పిన కథ మాత్రమే కాదు.. సంగీత దర్శకుడు అమిత్ త్రివేది ఇటీవల పంపిన ‘సైరా’ క్లైమాక్స్ సాంగును చిరు ఒక్కసారి వినగానే మార్పులు ఏమీ లేకుండా ఓకే చేశారని చరణ్ తెలిపాడు. తనకు తెలిసి చిరంజీవి ఎటువంటి మార్పులు లేకుండా పాటను ఓకే చేయడం కూడా ఇదే తొలిసారి అన్నాడు. ‘సైరా నరసింహారెడ్డి’ విడుదల విషయంలోనూ రామ్ చరణ్ స్పష్టత ఇచ్చారు. 2019… అనగా వచ్చే ఏడాది వేసవిలో విడుదల చేస్తామని అన్నారు. అది సమ్మర్ ఫస్టాఫా లేదా సెకండాఫా అనేది త్వరలో చెబుతామని అన్నారు.