‘రంగస్థలం’ తో ఓ సూపర్ డూపర్ హిట్టు కొట్టాడు రామ్ చరణ్. ఎంతటి హిట్టంటే.. మగధీర తరవాత ఈ స్థాయి హిట్టు తనకెప్పుడూ రాలేదు. వెంటనే బోయపాటి శ్రీనుతో సినిమా పట్టాలెక్కించాడు. నిజానికి ఇది చాలా తెలివైన ఎత్తుగడ. బోయపాటి మార్క్ తెలియంది కాదు. హీరోని ఓ స్థాయిలో చూపిస్తుంటాడు. పైగా సినిమాని హిట్టు చేయాల్సిందే అన్న కసితో పనిచేస్తుంటాడు. రంగస్థలం తో వచ్చిన ఇమేజ్‌ని కాపాడుకోవడం చరణ్‌కీ అత్యంత అవసరం. అలాంటప్పుడు బోయపాటి శ్రీను సినిమాపై ఎక్కువ ఫోకస్ పెట్టాలి. కానీ.. అలాంటిదేం జరగడం లేదని తెలుస్తోంది. చరణ్ వల్ల ఈ సినిమా షూటింగ్‌కి అప్పుడప్పుడూ అంతరాయం కలుగుతోందని ఇన్ సైడ్ వర్గాల టాక్.
చెప్పిన టైమ్‌కి షూటింగ్‌కి రావడం లేదని, సెట్లో అందరూ రెడీ ఉన్నా ‘ఈరోజు నేను రావడం లేదు’ అని సడన్‌గా ఫోన్ చేసి చెబుతున్నాడని, దాంతో చరణ్ వల్ల షూటింగుకి పేకప్ చెప్పాల్సిన పరిస్థితులు వస్తున్నాయని తెలుస్తోంది. చరణ్ దృష్టి ‘సైరా’ పై పడిందని, ఆ సినిమా విషయంలో తలమునకలై ఉన్నాడని, ఆ బిజీలోనే బోయపాటి సినిమాని అశ్రద్ద చేస్తున్నాడని సమాచారం. ఓ రోజు షూటింగ్ కాన్సిల్ అయ్యిందంటే.. నిర్మాతపై ఆర్థికంగా భారం పడుతుంది. మళ్లీ కాల్షీట్లు సర్దుబాటు చేయాలంటే, ఆర్టిస్టులు దొరకాలంటే చాలా కస్టం అవుతుంది. ఈమధ్య నిర్మాతగా మారిన చరణ్‌కీ ఈ బాధలు తెలుసు. అయినా సరే – చరణ్ వైఖరిలో మార్పు రావడంలేదట. పైకి చెప్పకపోయినా… చరణ్‌పై బోయపాటి కాస్త గుర్రుగా ఉన్నాడని, చరణ్ ఎప్పుడు షూటింగ్ వస్తాడో, ఎప్పుడు రాడో తెలీక నిర్మాత తలలు పట్టుకుంటున్నాడని సమాచారం. ‘రంగస్థలం’ హిట్టు తలకెక్కిందా, లేదంటే ‘సైరా’ని తలకెక్కించుకుని సతమతమవతున్నాడా అన్నది చరణ్ కే తెలియాలి.