శ్రీను వైట్ల దర్శకత్వంలో రామ్ చరణ్ తేజ్, రకుల్ ప్రీత్ సింగ్ జంటగా నటిస్తున్న సినిమాకి ‘బ్రూస్లీ’ అనే టైటిల్ ఖరారు చేశారు. ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్, టైటిల్ లోగో ఈ మధ్యనే చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా విడుదల చేసారు. ఈ సినిమాని అక్టోబర్ 16న దసరా పండుగ ముందు విడుదల చేయాలని భావిస్తున్నప్పటికీ సినిమా షూటింగ్ తదితర కార్యక్రమాలు అప్పట్లోగా ముగిసే అవకాశం కనబడటం లేదని టాక్ వినిపిస్తోంది. మళ్ళీ చాలా రోజుల తరువాత సినీ పరిశ్రమకి తిరిగివచ్చిన చిరంజీవి ఈ సినిమాలో సుమారు 15ని.ల నిడివి ఉండే ఒక గెస్ట్ రోల్లో కనిపించబోతున్నారు. ఈ సినిమాలో రామ్ చరణ్ తేజ్ మార్షల్ ఆర్ట్స్ శిక్షకుడిగా నటిస్తున్నారు. అందుకే దీనికి బ్రూస్లీ అనిపేరు పెట్టి ‘ఫైటర్’ సబ్ టైటిల్ ఇచ్చారు. ఇక మరో విశేషం ఏమిటంటే ఇదే పేరుతో తమిళంలో కూడా మరొక సినిమా తయారవుతోంది. దీనికీ తెలుగు బ్రూస్లీ కి కధలో ఎటువంటి సంబంధం లేదు. దీనిలో ప్రముఖ తమిళ హీరో జీవీ ప్రకాష్ కుమార్ హీరోగా నటిస్తున్నారు. ఈ సినిమాని ప్రశాంత పాండియ రాజ్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ తమిళ బ్రూస్లీ పక్కన మొదట నయనతారను హీరోయిన్ గా అనుకొన్నప్పటికీ డేట్స్ కుదరకపోవడంతో వేరే హీరోయిన్ కోసం చూస్తున్నారు. ఈ సినిమా కూడా దసరా లేదా దీపావళికి విడుదల చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. అంటే ఒకేసారి ఇద్దరు బ్రూస్లీలు వస్తారన్నమాట!