సుకుమార్ కథలన్నీ కెమిస్ట్రీ, ఫిజిక్స్‌తో ముడిపడి ఉంటాయి. స్ర్కీన్ ప్లేలో ఊహకు అందని లెక్కలుంటాయి. ప్రతీ సీన్ ఓ ఫజిల్లా సాగుతుంది. అలా లేకపోతే.. సుక్కుకి కథ రాసుకొన్నట్టే ఉండదు.. సినిమా తీసినట్టే అనిపించదు. ఆ లెక్కల గోల నాన్నకు ప్రేమతోలో బాగా ఎక్కువైంది. అయినా సరే, ఆ సినిమా ఎక్కేసింది. ఇప్పుడు రామ్‌చరణ్ సినిమాకి ఫార్ములా ఎక్స్ అనే పేరు పెట్టినట్టు ప్రచారం జరుగుతోంది. దాన్ని బట్టి ఇందులోనూ లెక్కలు, ఫిజిక్స్ చూపిస్తారేమో అని మెగా ఫ్యాన్స్ కంగారు పడుతున్నారు. అయితే… అలాంటిదేం లేదట. కాకపోతే.. చరణ్‌కి అతీంద్రియ శక్తులున్నట్టు చూపిస్తున్నారని టాక్.
అతీంద్రయ శక్తుల నేపథ్యంలో తెలుగులో చాలా సినిమాలొచ్చాయి. సోషియో ఫాంటసీలకు ఆదరణ కూడా బాగానే ఉంటుంది. అయితే ఆ టైపు సినిమాలు చరణ్ ఇప్పటి వరకూ చేయలేదు. సుకుమార్‌కి ఇది కొత్త జోనరే. కాబట్టి.. బాగానే వర్కవుట్ అయ్యే ఛాన్సుందనిపిస్తోంది. సురేందర్‌రెడ్డితో తెరకెక్కిస్తున్న ధ్రువ పూర్తయిన వెంటనే ఈసినిమాని పట్టాలెక్కిస్తారు. ప్రస్తుతానికి స్ర్కిప్ట్‌ని లాక్ చేశారు. త్వరలోనే పూర్తి వివరాలు బయటకు వస్తాయి.