‘గేమ్ ఛేంజర్’లో రామ్ చరణ్ షూటింగ్ పార్ట్ పూర్తయ్యింది. ఇందుకోసమే చాలా రోజులుగా బుచ్చిబాబు ఎదురుచూస్తున్నాడు. ఎందుకంటే గేమ్ ఛేంజర్ తరవాతి బెర్తు తనదే. చరణ్ – బుచ్చిబాబుల కాంబోలో సినిమా ఏనాడో ఫిక్సయ్యింది. చరణ్ రాక కోసమే ఆ టీమ్ అంతా వెయిట్ చేస్తోంది. గేమ్ ఛేంజర్ అవ్వగానే బుచ్చిబాబు సినిమా స్టార్ట్ అవ్వాలి. అయితే చరణ్ తొందరపడడం లేదు. తను కొంత బ్రేక్ తీసుకోవాలనుకొంటున్నాడు. ఇప్పట్లో చరణ్ బుచ్చిబాబుకు కాల్షీట్లు ఇచ్చే అవకాశం లేదని ఇన్ సైడ్ వర్గాల టాక్. దసరా తరవాతే.. ఈ సినిమా పట్టాలెక్కే ఛాన్సుందని తెలుస్తోంది.
అయితే బుచ్చిబాబు మాత్రం ఖాళీగా లేడు. స్క్రిప్టుని మరింత పకడ్బందీగా రాసుకొంటున్నాడు. అందుకోసం ఓ రైటింగ్ టీమ్ ని పెట్టుకొన్నాడు. బుచ్చిబాబు ఆఫీసు ఇప్పుడు ఏడెనిమిది రైటర్లతో కళకళలాడుతోంది. వీళ్లంతా చరణ్ స్క్రిప్టుని కాచి వడబోసే కార్యక్రమంలో ఉన్నారు. ఇదంతా సుకుమార్ స్టైల్. తను రైటింగ్ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకొంటాడు. సెట్ కి వెళ్లక ముందే చాలా వెర్షన్లు రెడీ అవుతుంటాయి. ఇప్పుడు శిష్యుడు కూడా అదే పంధా అనుసరిస్తున్నాడు. రెహమాన్ ఈ చిత్రానికి స్వరాలు సమకూరుస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే మూడు ట్యూన్లు కూడా సిద్ధమయ్యాయి. హైదరాబాద్ శివార్లలో ఈ సినిమా కోసం ఓ భారీ సెట్ ని తీర్చిదిద్దుతున్నారు. ప్రస్తుతం ఈ పనుల్లో బుచ్చిబాబు తలమునకలై ఉన్నాడు.