‘సైరా’… ఈ సినిమాపై వచ్చిన గాసిప్పులు అన్నీ ఇన్నీ కావు. సురేందర్‌రెడ్డి తప్పుకున్నాడని రాశారు. మరో దర్శకుడు జాయిన్ అవుతాడని మాట్లాడుకున్నారు. రీషూట్ల గురించి ఇక చెప్పనవసరం లేదు. తెరకెక్కించిన సన్నివేశాల్లో దాదాపుగా మూడో వంతు చిరు పక్కన పెట్టేశాడని, వాటిని రీషూట్ చేశారని చెప్పుకున్నారు. ఓ దశలో సూరిని పక్కన పెట్టి చిరునే ఈ సినిమాని తీసేసుకుంటున్నాడని కూడా అన్నారు. ఇప్పుడు ఈ చిత్రానికి సంబంధించిన మరో హాట్ న్యూస్ బయటకు వచ్చింది.
దాదాపు 200 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కుతున్న సినిమా ఇది. బాహుబలి తరవాత ఆస్థాయి బడ్జెట్ పెడుతున్న సినిమా ఇదే. చిత్రీకరణలో జాప్యం వల్ల, రీషూట్ల వల్ల ఇప్పటికే బడ్జెట్ చేయి దాటి పోయిందని తెలుస్తోంది. రాసుకున్న లెక్కలకూ, తేలిన అంకెలకూ ఏమాత్రం పొంతన కుదరడం లేదట. ఇది వరకు యదేచ్ఛగా ఖర్చు పెట్టిన చరణ్.. ఇప్పుడు బడ్జెట్ విషయంలో పరిమితులు విధించినట్టు సమాచారం. ‘ఇప్పటికే చాలా అయ్యింది. ఇక మీదట తీయబోయే సన్నివేశాల్ని చూసి తీయాల్సిందే. అడిగినంత బడ్జెట్ ఇవ్వడం కుదరదు’ అని చరణ్ సురేందర్ రెడ్డికి స్ట్రిక్ట్‌గా చెప్పేశాడట. అయితే… సినిమాలోకి కీలకమైన సన్నివేశాలు, వార్ ఎపిసోడ్లు ఇప్పటికే తెరకెక్కించేశారు. వాటి కోసమే బడ్జెట్ చాలా అయ్యింది. ఇప్పుడు తీయాల్సినవన్నీ టాకీకి సంబంధించిన సన్నివేశాలే. కాబట్టి బడ్జెట్ కంట్రోల్లో ఉంటుంది. కానీ.. సురేందర్ రెడ్డి దగ్గర వచ్చిన చిక్కేమిటంటే ఏదీ ఓ పట్టాన నచ్చదు. పర్ఫెక్షన్ పేరుతో తీసిందే తీస్తుంటాడు. బహుశా ఈ విషయంలో సూరి ఇప్పుడు జాగ్రత్తపడక తప్పదేమో. చరణ్ ప్రస్తుతం ‘ఆర్.ఆర్.ఆర్’ ప్రాజెక్టులో బిజీగా ఉన్నాడు. అయినా సరే.. ‘సైరా’కి సంబంధించిన అన్ని వ్యవహారాలనూ తానే దగ్గరుండి చూసుకుంటున్నాడు. సినిమా ఫలితంలో ఏమాత్రం తేడా వచ్చినా… ఆ ప్రభావం చాలా ఉంటుంది. బడ్జెట్ చేయి దాటితే… సినిమా బాగా ఆడినా లాభం ఉండదు. అందుకే.. చరణ్ ముందే జాగ్రత్త పడుతున్నాడన్నమాట.