హైదరాబాద్: రామ్‌చరణ్ భాగస్వామిగా ఉన్న టర్బో మేఘా ఎయిర్వేస్ సంస్థ హైదరాబాద్ కేంద్రంగా కార్యకలాపాలు ప్రారంభించటానికి కేంద్ర విమానయానశాఖ అనుమతి మంజూరు చేసింది. ట్రూ జెట్ పేరిట విమానయాన సర్వీసులు నడపటానికి కావలసిన అనుమతిని కేంద్ర విమానయాన శాఖమంత్రి అశోకగజపతిరాజు నిన్న టర్బో మేగా ప్రమోటర్లలో ఒకరైన వంకాయలపాటి ఉమేశ్‌కు అందజేశారు. 70 సీట్లున్న రెండు విమానాలతో హైదరాబాద్‌నుంచి తిరుపతి, బెంగళూరు, చెన్నై, ఔరంగాబాద్ నగరాలకు టర్బో మేఘా సర్వీసులు నడుపుతుందని, పుష్కరాలకు ప్రత్యేక సర్వీసులు నిర్వహించాలని తాము కోరామని మంత్రి చెప్పారు. దేశంలో ఇది నాలుగో ప్రాంతీయ విమానయాన సంస్థ అని, ఇలాంటివి రావటంవలన విమానయానం ప్రజలకు మరింత చేరువ అవుతుందని మంత్రి అన్నారు. విశాఖపట్నంలో భోగాపురంవద్ద అంతర్జాతీయ ప్రమాణాలతో విమానాశ్రయం నిర్మాణానికి స్థలపరిశీలన ప్రారంభమయిందని, ఇది పూర్తయితే మరో శంషాబాద్ విమానాశ్రయం అవుతుందని చెప్పారు. ఉమేశ్ మాట్లాడుతూ, ట్రూజెట్ సర్వీసులను రాంచరణ్ ఈనెల 10వ తేదీన అధికారికంగా ప్రకటిస్తారని తెలిపారు. దక్కన్ ఎయిర్, కింగ్ ఫిషర్ వైఫల్యాలనుంచి తాము పాఠాలు నేర్చుకున్నామని, ఇండిగో విమానాలనుంచి మెళుకువలు నేర్చుకున్నామని చెప్పారు.