తాజా గా జరిగిన ఓపెన్ హార్ట్ విత్ ఆర్కె కార్యక్రమానికి రామ్ గోపాల్ వర్మ హాజరయ్యారు. చంద్ర బాబు కు, ఎన్టీఆర్ కుటుంబానికి వ్యతిరేకంగా లక్ష్మీస్ ఎన్టీఆర్, అమ్మ రాజ్యంలో కడప బిడ్డలు వంటి సినిమాలు తీసిన రామ్ గోపాల్ వర్మ, తెలుగు దేశం పార్టీ కి ఆనుంగు ఛానల్ గా పేరుపడిన ఏబీఎన్ ఆంధ్ర జ్యోతి కి ఇంటర్వ్యూ ఇవ్వడానికి ముందుకు రావడం సహజంగానే ఆసక్తి కలిగించింది. ఊహించినట్లుగానే రాధాకృష్ణ రాంగోపాల్ వర్మ ని ఇబ్బంది పెట్టే కొన్ని ప్రశ్నలు వేయడం, దానికి ఆర్జీవి తనదైన శైలిలో సమాధానాలు ఇవ్వడం జరిగింది. వివరాల్లోకి వెళితే..
ఏబీఎన్ రాధాకృష్ణ రామ్ గోపాల్ వర్మ ని ఇంటర్వ్యూ చేస్తూ, వైఎస్ఆర్సీపీ ఎంపీ రఘు రామ కృష్ణంరాజును పోలీసులు చితక్కొట్టిన సంఘటన పై సినిమా తీయొచ్చు కదా అంటూ ప్రశ్నించారు. దీనికి వర్మ సమాధానం ఇస్తూ, తనకు ఆ ఉద్దేశం లేదని చెప్పుకొచ్చారు. పైగా దీనికి కారణాన్ని వివరిస్తూ, ఒక సినిమాకు కావాల్సినంత డ్రామా ఈ సంఘటనలో లేదని తేల్చేశారు. అయితే అక్కడతో ఈ విషయాన్ని వదిలి వేయని రాధాకృష్ణ, దిశ రేప్ అంశంపై సినిమా తీసిన రామ్ గోపాల్ వర్మ, చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా ఒక ఎంపీని పోలీసులు చావ కొడితే దాని పై సినిమా తీయడానికి ఎందుకు భయపడుతున్నారు అంటూ వ్యాఖ్యానించారు. దీనికి వర్మ సమాధానమిస్తూ, తనకున్న పరిధిలో తన ముందున్న 10 -12 సబ్జెక్టులలో ఎందులో డ్రామా ఎక్కువగా ఉంటే దానిపై తాను సినిమా తీస్తానని, రఘు రామ కృష్ణంరాజు సమస్య విషయంలో సినిమా చేయగలిగినంత డ్రామా లేదని తేల్చేశారు రాంగోపాల్ వర్మ. ఎంపీ ని కొట్టడం అనేది జర్నలిస్ట్ పాయింట్ ఆఫ్ వ్యూలో పెద్ద సమస్య అయి ఉండవచ్చు కానీ, ఆ సంఘటనకు ముందు వెనకాల ప్యాడ్ చేయడానికి కావాల్సినంత సరంజామా డ్రామా లేదని రాంగోపాల్ వర్మ సమాధానమిచ్చారు.
అయితే దీనికి కొనసాగింపుగా రాధాకృష్ణ మాట్లాడుతూ, పోనీ వివేకానంద రెడ్డి బాత్రూంలో చనిపోయిన అంశంపై రామ్ గోపాల్ వర్మ సినిమా తీయగలరా అంటూ ప్రశ్నించారు. రాంగోపాల్ వర్మ దీని పై కూడా తాను సినిమా తీయనని చెప్పేశారు. దీనికి కూడా పైన చెప్పిన కారణమే వర్తిస్తుందని, ఈ అంశంలో కూడా తగినంత డ్రామా లేదని రాంగోపాల్ వర్మ వాదించారు. అసలు వివేకా హత్య అంశాన్ని తాను పూర్తిగా ఫాలో కాలేదని, అది వైయస్ఆర్సిపి కి తెలిసి జరిగిందా తెలియక జరిగిందా అన్నది కూడా తనకు తెలియదని చెప్పుకొచ్చాడు రామ్ గోపాల్ వర్మ. అలాంటప్పుడు కొండా దంపతుల పై సినిమా తీస్తున్న రామ్ గోపాల్ వర్మ కు వారి జీవిత చరిత్ర లో సినిమా తీసేంత డ్రామా ఏం కనిపించిందని రాధాకృష్ణ ప్రశ్నించారు. రామ్ గోపాల్ వర్మ దానికి సమాధానం కొండా దంపతుల జీవితంలో చాలా నాటకీయత ఉందని, నక్సలిజం నేపథ్యం, రాజకీయ ప్రత్యర్థులు, ప్రేమ కథ వంటి పలు అంశాలు ఇందులో ఉన్నాయి అని చెప్పుకొచ్చారు. రఘురామ కృష్ణంరాజు, వివేకా కేసు వంటి విషయాలలో దోషులు ఎవరు అన్నది ఇంకా తీయలేదు అని కూడా గుర్తు చేశారు. అయితే రాధాకృష్ణ కూడా దోషులు ఎవరో తెలిస్తే నే రాంగోపాల్ వర్మ సినిమా తీస్తాడు అని తాను అనుకోవడం లేదని, దోషులు తేలని సందర్భాలలోనూ, కోర్టు పరిధిలో కేసు ఉన్న సందర్భాలలోనూ కూడా రాంగోపాల్ వర్మ గతంలో సినిమాలు తీసి ఉన్నారని గుర్తు చేశారు రాధాకృష్ణ.
తనదైన శైలిలో రాంగోపాల్ వర్మ ఎంతగా తనను తాను సమర్థించుకున్నప్పటికీ, రాధా కృష్ణ మాత్రం రఘు రామ కృష్ణంరాజు సంఘటనపై , వివేకానంద రెడ్డి హత్య పై సినిమా తీసే దమ్ములేని పిరికిపంద రామ్ గోపాల్ వర్మ అని అనుకోవచ్చా అని ప్రశ్నించగా, మీకు నచ్చిన విధంగా అనుకునే హక్కు మీకు ఉందని దాన్ని తాను పట్టించుకోనని రాంగోపాల్ వర్మ ఈ సమస్య పై చర్చను ముగించారు.