డైరెక్షన్‌కి కొత్త అర్థం చెప్పాడు వర్మ. శివ సినిమాలో వర్మ మేకింగ్ స్టైల్ చూసి దేశమంతా ఫిదా అయిపోయింది. తన మేకింగ్, ఆటిట్యూడ్, డ్రస్సింగ్ ఇవన్నీ కొత్త ఆలోచనలు రేకెత్తించాయి. వర్మ ఎన్ని ఫ్లాపుల్లో ఉన్నా సరే.. ‘మేం వర్మ శిష్యులం’ అని చెప్పుకోవడానికి వెనుకంజ వేయరు కొంతమంది నవ దర్శకులు. ఈమధ్య వర్మకి బాగా బద్దకమేస్తోంది. అందుకే సెట్‌కి వెళ్లకుండానే సినిమాల్ని తీసేస్తుంటాడు. సెల్ ఫోన్, వాట్సప్ కాల్ ద్వారా తనకేం కావాలో సెట్లో ఉన్నవాళ్లకు చెబుతుంటాడు వర్మ. అలా వర్మకి కావల్సినట్టుగా సినిమాని తీస్తుంటారు. వర్మ పనంతా ఎడిటింగ్ రూమ్ లోనే. హాయిగా రాత్రి ఓ వాడ్కా బాటిల్ ముందు పెట్టుకుని ఎడిటింగ్‌లో కట్లూ, ప్యాచింగులూ చెబుతుంటాడు.
అక్షరాలా ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ విషయంలో ఇదే జరిగింది. ఈ సినిమా కోసం సెట్‌కి వెళ్లి కెప్టెన్ కుర్చీలో కూర్చోవడం చాలా అరుదుగానే జరిగిందని ఇన్ సైడ్ వర్గాల టాక్. ఈ సినిమాని చాలా కసిగా తీశా, ఇది నా కెరీర్లో స్పెషల్ ఫిల్మ్ అవుతుందని చెప్పుకొంటున్న వర్మ… ఇలా ఆఫీసులోనే కూర్చుని సినిమా మొత్తాన్ని నడిపించేయడం ఆయన అభిమానులకు సైతం అర్థం కాని విషయం.
ఇటీవల వర్మ పనితీరు అచ్చంగా ఇలానే ఉంది. సహాయ దర్శకులపై ఆధారపడి సినిమాల్ని లాగించేస్తున్నాడు వర్మ. నాగార్జునతో తీసిన ‘ఆఫీసర్’ మాత్రం సెట్ కి వెళ్లి కాస్త ఒళ్లు వంచాడు. అది కూడా నాగార్జున కనిపించే సన్నివేశాలకు మాత్రమే. ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’కి అదీ లేదు. అందుకే టైటిల్ కార్డులో తన పక్కన మరో వ్యక్తి కీ చోటిచ్చాడు. ఇన్నేళ్లుగా కేవలం సహాయకులపైనే ఆధారపడుతూ సినిమాలు తీస్తున్న వర్మ.. డైరెక్షన్ కార్డులో తన పక్కన మరో వ్యక్తి కి చోటివ్వలేదు. తొలిసారి ఆ విచిత్రం ఈ సినిమాతోనే జరిగింది. ఈ సినిమా మేకింగ్ కష్టమంతా అగస్త్య మంజు అనే సహాయకుడిది. పేరేమో వర్మది. కనీసం టైటిల్ కార్డులో ఆ పేరైనా కనిపించింది. ప్రచార కార్యక్రమాల్లో మాత్రం అగస్త్యని పూర్తిగా సైడ్ చేసేస్తున్నారు.