రాంగోపాల్ వర్మ నుంచి సినిమా వస్తోందంటే ఆసక్తిగా ఎదురుచూసి, ఈసారి ఏం చూపించబోతున్నాడో అంటూ కళ్లు పెద్దవి చేసుకొనేలా చేయడం మర్చిపోయారు తెలుగు ప్రేక్షకులు. తన సినిమాలపై ఉండే క్రేజ్‌ని తానే చేతులారా చంపేసుకొన్నాడు. అయితే.. ‘ఎన్టీఆర్ జీవిత కథ తీస్తా’ అని చెప్పి మళ్లీ తనపై ఫోకస్ పడేలా చేశాడు. ఎన్టీఆర్ అంటే ఆయనో సినిమా నటుడో, రాజకీయ నాయకుడో కాదు. తెలుగువారి ఆస్తి. తెలుగువాళ్లకి ఎన్టీఆర్ చరిత్ర సమగ్రంగానే తెలుసు. దాన్ని ఎలా చూపిస్తాడా, ఎలాంటి కొత్త వివాదాలు రేకెత్తిస్తాడా?? అని ఆసక్తిగా ఎదురు చూడడం మొదలెట్టారు సినీ జనాలు.
అయితే.. సినిమా తీయకుండానే ఆ ఆసక్తి చంపేసే పనిలో పడ్డాడు వర్మ. ఈ కథని లక్ష్మీపార్వతి కోణంలో తీస్తా అని చెప్పి ఆసక్తిని నీరుగార్చాడు. అంటే లక్ష్మీ పార్వతి ఎన్టీఆర్ జీవితంలో ప్రవేశించిన తరవాత నుంచీ కథ మొదలవుతుంది. అంటే.. వయసు మళ్లి, అటు రాజకీయ పరంగానూ అవసాన దశలో ఉన్న ఎన్టీఆర్ కథని చూపిస్తాడన్నమాట. అప్పటికే ఈ సినిమాలో ‘పెప్’ పెద్దగా ఏమీ ఉండదని అర్థమైపోయింది. ఎన్టీఆర్ ఆత్మకథ పేరుతో లక్ష్మీ పార్వతి కథ చెప్పేస్తాడేమో అన్న భయమూ కలుగుతుంది నందమూరి అభిమానులకు. సినిమాల్లో ఎలా ఎదిగాడు, రాజకీయంగా ఏం సాధించాడు? అనేది ఎన్టీఆర్ కథలో కీలకమైన ఘట్టాలు. వాటి జోలికి వర్మ వెళ్లదలచుకోలేదు. ఎన్టీఆర్ సినీ చరిత్ర చూపించాలనుకొంటే ఏఎన్నార్, సావిత్రి, రంగారావు లాంటి క్యారెక్టర్లు చూపించాలి. దాని కోసం బోలెడంత కసరత్తు చేయాలి. ఆ కాలం నాటి సెట్స్ రూపొందించాలి. ఇవన్నీ డబ్బుతో కూడిన వ్యవహారాలు. పైగా టైమ్ పట్టుద్ది. అందుకే వాటి జోలికి వెళ్లకుండా చాలా తక్కువ పాత్రలు ఉండేలా చూసుకొని, నామ్ కే వాస్తే అన్నట్టు ఈ సినిమా ముగించేసి, నాలుగు డబ్బులు సంపాదించుకొనే పనిలో ఉన్నాడాయన.
ఇప్పుడు ఈ కథలో ఎన్టీఆర్‌గా ఎవరు కనిపించబోతున్నారు అనే ప్రశ్న మొదలైంది. ఈ పాత్ర కోసం వర్మ ప్రకాష్‌రాజ్ పేరు పరిశీలిస్తున్నారని తెలుస్తోంది. ప్రకాష్ రాజ్ అనగానే ఈ సినిమాపై కాస్తో కూస్తో ప్రేమ పెరుగుతుంది. ఎన్టీఆర్ లా నటించడం ఆయనకు పెద్ద విషయం కాకపోవొచ్చు. కాకపోతే.. ప్రకాష్‌రాజ్‌ని చూసీ చూసీ ఆయన అణువణువూ చదివేసిన తెలుగు ప్రేక్షకుల కళ్లకు ప్రకాష్ రాజే కనిపిస్తాడు గానీ, ఎన్టీఆర్ కాదు. ఆ పాత్రలో ఎవరినైనా కొత్త నటుడ్ని చూపిస్తే బాగుంటుందేమో. ‘వీరప్పన్’ సినిమా తీస్తూ.. ఊరు, పేరు లేని నటుడ్ని తీసుకొచ్చి వీరప్పన్‌గా చూపించగలిగాడు వర్మ. ఆ ప్రయత్నం వర్కవుట్ అయ్యింది. తెరపై వీరప్పనే కనిపించాడు. ఈసారీ అలా తీరిగ్గా వెదుక్కొంటే ఎన్టీఆర్ పాత్ర పోషించగల నటుడు దొరుకుతాడు. కానీ.. వర్మ దగ్గర అంత టైమ్ లేదేమో. ఒకవేళ ఎన్టీఆర్ కథని పూర్తిగా లక్ష్మీ పార్వతి కోణంలోనే తీసి, అందులో ప్రకాష్ రాజ్‌ని ఎన్టీఆర్‌గా నిలబడితే… వర్మ ఈ కథని తప్పుదోవ పట్టించినట్టే అనుకోవాలి.