దిశ నిందితుల ఎన్ కౌంటర్ పై రామ్ గోపాల్ వర్మ స్పందించారు. ఆయన ట్వీట్ చేస్తూ, ప్రజలలో ఈ ఎన్ కౌంటర్ పై హర్షం వ్యక్తం కావడం అర్థం చేసుకోవచ్చు కానీ, మనకు చట్టాలు ఉన్నాయి అని, చట్టప్రకారం శిక్షించక పోతే సమాజం బాగుపడదని, చట్టాలననుసరించి నిందితులను శిక్షించాలని ఇలా పెద్ద పెద్ద డైలాగులు చెప్పారు. సడన్ గా రాంగోపాల్ వర్మ కి సమాజం మీద ఇంత ప్రేమ, ఇంత బాధ్యత ఎందుకు వచ్చిందో ఆయన ట్వీట్ లను చదివిన వాళ్లకు అర్థం కాలేదు.
గతంలో జిఎస్టి అనే పోర్న్ సినిమా తీసిన రామ్ గోపాల్ వర్మ, ఆ సినిమా విడుదలకు ముందు పలు టీవీ ఛానల్స్ లో చర్చల్లో పాల్గొన్నారు. ఆ సందర్భంగా బాధ్యత గల దర్శకుడు నుండి ఇటువంటి పోర్న్ సినిమాలు తీయడం ఎంతవరకు సమంజసం అని టీవీ చానల్స్ యాంకర్స్ కానీ, మహిళా సంఘాల వారు కానీ ప్రశ్నించినప్పుడు, సమాజం ఎటు పోతే తనకు ఏంటని, తనకు సామాజిక బాధ్యత ఏ మాత్రం లేదని నిస్సిగ్గుగా స్వయంగా తానే ప్రకటించుకున్నారు. జిఎస్టి సినిమా తీసినప్పుడు అనే కాదు, అంతకుముందు ఆయన సినిమాల వల్ల సమాజం మీద వ్యతిరేక ప్రభావం పడుతుందని ఎవరు ఆయన దృష్టికి తీసుకు వచ్చినా, తాను సమాజాన్ని ఉద్దరించడానికి రాలేదని, తనకు సామాజిక బాధ్యత లేదని, తనకు నచ్చింది తాను చేస్తానని ఇలా నోటికి వచ్చినట్లు మాట్లాడారు రాంగోపాల్ వర్మ.
తాను తీసిన సినిమాలలో కూడా, చట్టానికి అతీతంగా న్యాయం చేయడం అనే దానిని రాంగోపాల్ వర్మ విస్తృతంగా ప్రచారం చేశాడు. గాయం, సర్కార్, వంటి గాడ్ ఫాదర్ ఆధారంగా తీసిన సినిమాలన్నింటిలోనూ చట్టానికి , రాజ్యాంగానికి అతీతంగా న్యాయం చేయడాన్ని విస్తృతంగా ప్రచారం చేసిన రాంగోపాల్ వర్మ హఠాత్తుగా సమాజం గురించి సామాజిక బాధ్యత గురించి మాట్లాడుతుంటే దాన్ని చదివిన జనాలు రాంగోపాల్ వర్మ వేదాలు వల్లించడం ఏంటని ఆశ్చర్యపోతున్నారు.