హైదరాబాద్: నాన్నకు ప్రేమతో ట్రైలర్‌పై, జూనియర్ ఎన్టీఆర్‌పై రామ్‌గోపాల్ వర్మ ప్రశంశలు గుప్పించారు. జూనియర్ ఎన్టీఆర్ తెలుగు సినిమాను హాలీవుడ్ స్థాయికి తీసుకెళ్ళాడని, సుకుమార్‌కు అభినందనలని ట్విట్టర్లో పేర్కొన్నారు. భారీతనంలోనో, విజువల్గానో కాకుండా ప్రయత్న పరంగా సుకుమార్ చేసిన కృషి బాహుబలికంటే గొప్పదని వ్యాఖ్యానించారు. ఎట్టకేలకు తారక్ నియంతృత్వపు(డిక్టెటోరియల్) పాతదనంలోని మూర్ఖత్వాన్ని బద్దలుకొట్టి పరిణామశీల నూతనత్వంలోకి దూసుకెళ్ళాడని అంటూ బాలకృష్ణ కొత్త సినిమా ‘డిక్టేటర్’పైన చురకలు వేశారు. పాతబడిపోయిన మాసీనెస్కు తారక్ అల్టిమేట్ క్లాసీనెస్ తీసుకొచ్చాడని అన్నారు. పెద్ద ఎన్టీఆర్ స్వర్గంలోనుంచి చూస్తే కిందకొచ్చి తన మనవడిని కౌగలించుకుంటాడని వ్యాఖ్యానించారు. డిక్టేటర్లు వెనక్కు వెళ్ళిపోతారని, ఎవల్యూషనరీలు ముందుకెళతారని అన్నారు. అడవిరాముడుకు నువ్వొక్కడివే సరైన వారసుడివి తారక్ అని ట్వీటారు. నాన్నకు ప్రేమతో ట్రైలర్లో తనకు నచ్చినది – ఒక డిక్టేటర్ ప్రేమను డిమాండ్ చేసినట్లు కాకుండా, ప్రేమను చూరగొంటుందని వర్మ వ్యాఖ్యానించారు. బాలకృష్ణ రాబోయే చిత్రం పేరు ‘డిక్టేటర్’ అన్న సంగతి తెలిసిందే.