ద్రౌపది అని పేరు కనిపిస్తే చాలా మందికి ఒక్కటే గుర్తుకు వస్తుంది. ఆర్జీవీకి అదే గుర్తుకు వచ్చింది. చాలా మంది అలా అనకూడదని మనసులో అనుకుంటారు. కానీ ఆర్జీవీ మాత్రం వేరు కదా. వోడ్కా గొంతులోకి దిగగానే ఫోన్ తీసుకుని ట్విట్టర్ ఓపెన్ చేసి తాను ఏమనుకుంటాడో అది రాసేస్తారు. ఇప్పుడు కూడా అదే చేశారు. భారత కొత్త రాష్ట్రపతి అభ్యర్థిగా బీజేపీ తరపున ద్రౌపది ముర్మును ఖరారు చేశారు. ఆమె గెలుపు లాంఛనమే. అయితే ఆమె ద్రౌపది అయితే .. పాండవులు ఎవరు..? కౌరవులు ఎవరు ? అంటూ ఆర్జీవీ ట్వీట్ చేసేశారు. ఆయన ట్వీట్ చూసి అందరూ ఒక్క సారిగా నిర్ఘాంతపోయారు.
ద్రౌపది ముర్ము జీవితం గురించి.. ఆమె రాజకీయ పయనం గురించి తెలిసిన వారెవరూ ఇలాంటి కామెంట్లు చేయరు. ఆమె ఓ నిరుపేద గిరిజన కుటుంబంలో జన్మించి.. చదువంటే తెలియని తెగ నుంచి టీచర్‌గా ఎదిగి.. రాజకీయాల్లోకి వచ్చి గిరిజనుల అభ్యున్నతికి ప్రయత్నించారు. అలాంటి వ్యక్తి గురించి పాండవులు ఎవరు.. కౌరవులు ఎవరు అంటూ వ్యాఖ్యలు చేయడం వివాదాస్పదయింది. ఆయనపై పలువురు బీజేపీ నేతలు పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదు చేస్తున్నారు. ఈ విషయాన్ని బీజేపీ హైకమాండ్ కూడా సీరియస్‌గా తీసుకుంటుందన్న ప్రచారం జరుగుతోంది.
ద్రౌపది ముర్మును అభ్యర్థిగా ఖరారు చేసిన తర్వాత విపక్ష పార్టీలు కూడా ఎక్కడా అభ్యంతరకరంగా స్పందించడానికి సిద్ధపడలేదు. ఆమెకు సానుకూలత ఉంది. ఆమెపై అనుచిత వ్యాఖ్యల్ని బీజేపీ హైకమాండ్ క్షమించదన్న అభిప్రాయం వినిపిస్తోంది. వారు కాస్త టైం తీసుకుంటే.. ఈ వ్యాఖ్యలపైననే కాకుండా ఇతర వివాదాలతో ఆర్జీవీని ఓ ఆటాడుకోవడం ఖాయమన్న అభిప్రాయం వినిపిస్తోంది. పైకి గంభీరంగా కనిపించే ఆర్జీవీకి పోలీసులంటే హడల్. త్వరలో బీజేపీ పెద్దలు సినిమా చూపించడం ఖాయమన్న వాదన ఇప్పటికే వినిపిస్దోంది.