మంచో, చెడో. తప్పో, ఒప్పో. రాంగోపాల్ వర్మ లాజిక్కు ఎప్పుడూ ఫెయిల్ కాదు. తనని మాటలతో ఓడించడం చాలా కష్టం. ప్రతీ దానికీ ఓ లాజిక్ తీసి, దానికో బ్రహ్మ ముడి వేసేస్తాడు. అందుకే వర్మ ఏం చేసినా చెల్లుబాటు అయిపోతోంది. ఎన్ని కుప్పిగంతులు వేసినా చూసి, భరించాల్సి వస్తోంది. ఎన్ని వెర్రి మొర్రి వేషాలు వేసినా సహించాల్సి వస్తోంది. అలాంటి వర్మ, తొలిసారి లాజిక్ తప్పి మాట్లాడేశాడు.
‘వర్మ తల నరికి తెస్తే కోటి రూపాయలు ఇస్తా’ అని ఓ టీవీ ఛానల్ లో కొలకపూడి శ్రీనివాసరావు చేసిన వ్యాఖ్యకు హడలిపోయి విజయవాడలో పోలీసులకు ఫిర్యాదు చేశాడు వర్మ. అసలు ఈ కేసుకీ, హైదరాబాద్లో ఉన్న కొలకపూడికి, విజయవాడ పోలీసులకు ఏమిటి సంబంధం అనుకోవొచ్చు. అది వేరే టాపిక్కు. పెద్ద మనసు చేసుకొని దాన్ని పక్కన పెట్టేద్దాం. ముంబై మాఫియా తనని బెదిరించినా, అస్సలు చలించలేదు అని చెప్పుకొన్న వర్మ – ఓ టీవీ ఛానల్ లో ఎవరో ఏదో మాట్లాడితే, ప్రాణ భయంతో విజయవాడ ఫ్లయిట్ ఎక్కడం.. నిజంగా వర్మ వేసే వెర్రి వేషాలంత సిల్లీగా ఉంది. సరే.. దాన్నీ పక్కన పెట్టేద్దాం. కొలకపూడి వ్యాఖ్యల పట్ల చంద్రబాబు నాయుడు, లోకేష్, పవన్ కల్యాణ్ ఖండించలేదని మరో ఫిర్యాదు చేశాడు వర్మ. అసలు కొలకపూడికీ పవన్ కల్యాణ్కీ ఉన్న లింకేమిటో వర్మకైనా తెలుసా? అపర మేధావి అని పొంగిపోయే వర్మ ఇంత సిల్లీగా ఎలా మాట్లాడుతున్నాడో అర్థం కాదు. ఆ డిబేట్లో వర్మ చెప్పే సరదు వ్యక్తులెవరూ లేరే? అలాంటప్పుడు వాళ్లెందుకు ఖండిస్తారు? చంద్రబాబు, లోకేష్, పవన్ ఖండించలేదు సరే.. మరి తను చెప్పినట్టల్లా ఆడే.. వర్మని ఇంత మాటంటే జగన్ ఆ వ్యాఖ్యల్ని ఇంకెన్ని ఖండఖండాలుగా ఖండించాలో కదా? మరి ఆయనా మాట్లాడలేదే. అలాంటప్పుడు ఆయన్నీ, ఈ వ్యాఖ్యల్ని ఖండించని మిగిలిన వైకాపా నాయకుల్ని వర్మ ఎందుకు నిలదీయలేదు..? ఇదంతా సిల్లీగా లేదూ..?
ఇంత చేసినా వర్మలో మెచ్చుకోదగిన విషయం ఒకటుంది. ఈ విషయాన్ని కూడా ఆయన తన సినిమా పబ్లిసిటీ కోసం వాడుకొన్నాడు. తన ‘వ్యూహం’ చూసి తెలుగు దేశం భయపడిపోతోందని, భుజాలు తడుముకొంటోందని.. మరోసారి తన పబ్లిసిటీ పైత్యం చూపించాడు వర్మ.