వర్మ ఎప్పుడు ఎలా మాట్లాడతాడో అస్సలు అర్థం కాదు. మొన్నటికి మొన్న ఏపీ మంత్రులు .. హీరోలు, దర్శకుల వల్లే సినిమాల బడ్జెట్లు పెరిగిపోతున్నాయని, వాళ్లు అర్జెంటుగా పారితోషికాలు తగ్గించుకోవాలని చెబితే… `హీరోల పారితోషికాలు డిసైడ్ చేయడానికి మీరెవరు? హీరోల క్రేజ్‌ని బట్టి, డిమాండ్ ని బట్టి పారితోషికాలు ఇస్తారు… అది కూడా బడ్జెట్ లో ఓ భాగమే` అని లాజిక్ తో ఆన్సర్ చెప్పాడు. అది నిజం కూడా. కాబట్టి… వర్మని అంతా వెనకేసుకొచ్చారు. ఇప్పుడు సడన్ గా మాట మార్చేశాడు వర్మ.
హీరోలు అర్జెంటుగా పారితోషికాలు తగ్గించుకోవాలని, ఆ డబ్బులు సినిమా మేకింగ్ పై పెడితే, అప్పుడు అద్భుతమైన సినిమాలొస్తాయని తాజాగా వ్యాఖ్యానించాడు. మొన్నటి మాటలకూ, ఇప్పటి ట్వీట్‌కీ… అస్సలు పొంతన లేదు. టోటల్ గా ఇది రివర్స్ గేర్. కేజీఎఫ్ 2 చూసి వర్మ మురిసిపోయాడు. ఆ సినిమాని నెత్తిమీద పెట్టుకుని, తెగ మోస్తున్నాడు. ఆ సినిమాలో విషయం ఉంది కాబట్టి తప్పు లేదు.కాకపోతే.. ఇప్పుడు స్టార్ హీరోల పారితోషికాలపై పడడమే విడ్డూరంగా ఉంది. హీరోలకు భారీ పారితోషికాలు ఇవ్వడం దండగన్నది వర్మ మాట. ఆ డబ్బులన్నీ మేకింగ్ పై పెడితే.. కేజీఎఫ్ 2లాంటి సినిమాలొస్తాయన్నది తన తాత్పర్యం. కేజీఎఫ్ 2 కోసం యశ్‌కి ఎంతిచ్చారన్నది ఎవరికీ తెలీదు. ఆర్.ఆర్.ఆర్ కోసం ఎన్టీఆర్, చరణ్‌లకు భారీగానే ముట్టజెప్పారు. అయినా… సినిమాలో క్వాలిటీ తగ్గిందా? రాబడి ఆగిందా? లేదు కదా.? హీరోల పారితోషికం కూడా బడ్జెట్లో భాగమే. హీరోల్ని బట్టే… వసూళ్లు ఉంటాయి. అదే ఆర్.ఆర్.ఆర్, చిన్న హీరోలతో తీసుంటే ఈ స్థాయిలో వర్కవుట్ అయ్యేదా? – ఇంత చిన్న లాజిక్‌ని వర్మ ఎలా మిస్సయ్యాడో?