తానా సభలో బిజెపి వ్యూహకర్త, బిజెపి జాతీయ ప్రధాన కార్యదర్శి రామ్ మాధవ్ ప్రసంగిస్తుండగా సభికుల నుండి అనూహ్యంగా తీవ్ర నిరసనలు, నినాదాలు వచ్చాయి. దీంతో రామ్ మాధవ్ తన ప్రసంగాన్ని అర్ధాంతరంగా ముగించాల్సి వచ్చింది. వివరాల్లోకి వెళితే..
బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి రామ్ మాధవ్ తన ప్రసంగంలో మోడీ గురించి, బిజెపి గురించి మాట్లాడడం మొదలు పెట్టగానే అనూహ్యంగా సభికుల నుండి నిరసనలు రావడంతో గందరగోళం ఏర్పడింది. రామ్ మాధవ్ తన ఉపన్యాసాన్ని అర్ధాంతరంగా ఆపివేశారు. తానా నిర్వాహకులు మైక్ పుచ్చుకొని, ఇలా నిరసనలు వ్యక్తం చేయడం సరికాదంటూ సభికులను హెచ్చరించారు. మొత్తానికి నిరసనల మధ్యే కాసేపు తన ప్రసంగాన్ని కొనసాగించిన రామ్ మాధవ్ ఆ తర్వాత ప్రసంగాన్ని ముగించారు. ప్రసంగం ముగించిన అనంతరం మీడియాతో మాట్లాడారు.
తాను రాజకీయాల కోసం తానా సభలకు రాలేదని, బిజెపి వైపు నుండి తెలుగువాడిగా ఈ సభలకు వచ్చానని పేర్కొన్నారు. ఆపరేషన్ ఆకర్ష్ కోసమే ఇక్కడికి వచ్చారా అని ప్రశ్నించిన మీడియాకు, అలాంటిదేమీ లేదని సమాధానం ఇచ్చారు. పవన్ కళ్యాణ్ తో జరిగిన చర్చకు సంబంధించిన వివరాలను మీడియా గుచ్చి గుచ్చి అడిగినప్పటికీ దాటవేశారు. అదే విధంగా పవన్ కళ్యాణ్ తో కలిసి పని చేసే ఉద్దేశం ఉందా అన్న ప్రశ్న కూడా అలాంటిదేమీ లేదు అంటూ ముక్తసరిగా సమాధానం ఇచ్చారు. బీజేపీని దేశంలోని అన్ని రాష్ట్రాల్లో బలోపేతం చేస్తాం అన్న రాజకీయ వ్యాఖ్య తప్ప, ఆపరేషన్ ఆకర్ష్ గురించి కానీ తెలుగు రాష్ట్రాల్లో రాజకీయ పరిణామాల గురించి గానీ మాట్లాడలేదు.
ఏది ఏమైనా రామ్ మాధవ్ ప్రసంగం సమయంలో గందరగోళం నెలకొనడం ఆశ్చర్యాన్ని కలిగించింది.