ఆంధ్రప్రదేశ్ లో సొంతంగా ఎదగాలి.. ఇది భాజపా లక్ష్యం. ఇతరులపై ఆధారపడకుండా సొంతంగా ఎదగాలి.. ఇది ఈ మధ్య మరింతగా బలపడిన లక్ష్యం. కేవలం టీడీపీతో పొత్తు కొనసాగుతూ ఉండటం వల్లనే తాము ఎదగలేకపోయామన్న అసంతృప్తి ఏపీ భాజపా నేతల్లో ఎప్పట్నుంచో ఉంది. ఇప్పుడు ఎలాగూ పరిస్థితులు అనుకూలించాయని వారు అనుకుంటున్నారు. ఎన్డీయే నుంచి టీడీపీ బయటకి వచ్చేసింది. ఆ పార్టీ ఇప్పుడు భాజపాకి ప్రత్యర్థి పక్షమైపోయింది. ఈ నేపథ్యంలో ఏపీకి భాజపా చాలా చేసిందనే ప్రచారం చేసేందుకు ఏపీ నేతలు సిద్ధమౌతున్నారు. ఏపీలో పార్టీ ఎదుగుదలకు అనుసరించాల్సిన వ్యూహాలన్నీ ఇకపై రామ్ మాధవ్ రచిస్తారని తెలుస్తోంది. అందుకే, ఆయనే తెరమీదికి వస్తున్నారు. టీడీపీపైనా, సీఎం చంద్రబాబుపై కూడా ఆయనే విమర్శలు చేస్తున్నారు. ఇక భాజపా సంధించబోతున్న ప్రశ్నలకు చంద్రబాబు సమాధానం చెప్పాలంటున్నారు. త్రిపురలో ఆయనే కదా… భాజపాని గెలిపించింది! ఇప్పుడు అదే తరహాలో వచ్చే ఎన్నికల్లో ఏపీలో కూడా భాజపాని ఆయనే నడిపిస్తారని సమాచారం..!
ఇంతకీ ఏపీలో రామ్ మాధవ్ అనుసరించబోతున్న తొలి వ్యూహం ఏంటంటే… ఆపరేషన్ ఆకర్ష్ అనే చర్చ జరుగుతోంది. ఇకపై భాజపాలో చేరికల్ని ప్రోత్సహించాలన్నది భాజపా తొలి అడుగుగా చెప్పుకుంటున్నారు. అది కూడా క్షేత్రస్థాయి నుంచి.. అంటే, పంచాయతీల స్థాయి నుంచి చేరికల్ని ప్రోత్సహించాలన్నది రామ్ మాధవ్ ఆలోచనగా ఉందనే చర్చ భాజపా వర్గాల్లో జరుగుతోంది. త్రిపురలో కూడా ఇదే వ్యూహాన్ని ఆయన అమలు చేశారు. అక్కడ కాంగ్రెస్ నేతల్ని, వామపక్షాల నేతల్ని ఆయనే దగ్గరుండి భాజపాలో చేర్పించారు. పేరున్న నేతలతోపాటు పెద్ద ఎత్తున కేడర్ కూడా భాజపాకి ఒకేసారి వచ్చిపడుతుందనీ, త్రిపురలో భాజపా విజయానికి అదే అనూహ్యంగా కలిసొచ్చిన కారణమని భాజపా నేతలు విశ్లేషించుకుంటున్నారు. కాబట్టి, ఆంధ్రాలో కూడా అదే మోడల్ ను రామ్ మాధవ్ అనుసరిస్తారట..!
ఇక్కడ రామ్ మాధవ్ గానీ, భాజపా నేతలుగానీ మిస్ అవుతున్న లాజిక్ ఏంటంటే.. త్రిపురలో పరిస్థితులకీ, ఆంధ్రాలో ఇప్పుడున్న సెంటిమెంట్ కీ చాలా తేడా ఉంది. త్రిపురలో ఇంతకుముందు భాజపా ఉనికే లేదు. రామ్ మాధవ్ వ్యూహం అక్కడ జీరో నుంచి ప్రారంభమైంది. కాబట్టి అక్కడ ఏ ఇమేజ్ లేకుండా భాజపా ఎంట్రీ ఇచ్చింది. కానీ, ఏపీలో భాజపాపై తీవ్రమైన వ్యతిరేకత ఉంది. వచ్చే ఎన్నికల్లో ఏపీలో భాజాపాతో పొత్తు పెట్టుకోవడానికి ఏ పార్టీ అయినా ఒకటికి రెండుసార్లు ఆలోచించాల్సిన పరిస్థితి. ఇప్పుడు కేంద్రంతో తమ రాజకీయ ప్రయోజనాల కోసం వెంపర్లాడుతున్న వైకాపాలో కూడా, భాజపాతో పొత్తు అంటే భిన్నాభిప్రాయాలున్నాయి. ఇక, చేరికల విషయానికొస్తే.. త్రిపురలో మాదిరిగా పొలోమంటూ భాజపాలోకి వచ్చేసేవారు టీడీపీలోగానీ, వైకాపాలోగానీ ఎంతమంది ఉన్నారనేది చాలా పెద్ద ప్రశ్న..? మహా అయితే ఎటూ దిక్కుతోచని ఏపీ కాంగ్రెస్ నేతలు వచ్చి చేరే అవకాశం ఉంటుందేమోగానీ… అధికార, ప్రతిపక్షాల నుంచి భాజపాలోకి చేరికలు అంటే ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఊహించలేం.