లాంఛనాలు పూర్తయిపోయాయి. ఉప రాష్ట్రపతిగా వెంకయ్య నాయుడు విజయం సాధించేశారు. దీనికంటే ముందే రాష్ట్రపతి ఎన్నికల తతంగం కూడా ముగిసింది. ఈ రెండు ఎన్నికల తరువాత కొన్ని మార్పులు ఉంటాయంటూ ఈ మధ్య ప్రచారం జరుగుతూ వచ్చింది. క్రియాశీల రాజకీయాలకు వెంకయ్య నాయుడు దూరం అవుతున్న నేపథ్యంలో ఇకపై కేంద్రానికీ, తెలుగు రాష్ట్రాలకీ మధ్య సంధానకర్తగా వ్యవహరించేదెవరు అనే చర్చ జరిగింది. ఈ క్రమంలో రాంమాధవ్ పేరు ప్రముఖంగా తెర మీదికి వచ్చింది. ఆయనకు కేంద్రమంత్రి పదవి ఇచ్చే అవకాశం ఉందనే కథనాలూ వచ్చాయి. ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో భాజపా బాధ్యతల్ని కూడా ఆయనకే ఇస్తారని అనుకున్నారు. అయితే, ప్రస్తుతం ఈ అంశమై భాజపా జాతీయ నాయకత్వం ఆలోచనలు ఇంకోలా ఉన్నట్టు తెలుస్తోంది.
రాంమాధవ్ కు జాతీయ పగ్గాలు ఇప్పట్లో ఇవ్వాల్సిన అవసరం లేదని ఢిల్లీ పెద్దలు విశ్లేషణ చేస్తున్నారట. ఎందుకంటే, పార్టీలో చాలామంది సీనియర్ నాయకులు ఉన్నారనీ, వారితో పోల్చితే రాంమాధవ్ ఇంకా జూనియరే కాబట్టి, ప్రస్తుత పరిస్థితుల్లో ఆయన్ని కొన్నాళ్లపాటు ఆపొచ్చనేది పార్టీ వ్యూహంగా ప్రచారం జరుగుతోంది. పైగా, ఇప్పటికప్పుడు ఆయన బాధ్యతల్ని మార్చేసి, మంత్రివర్గంలోకి తీసుకొస్తే పార్టీకి చాలా ఇబ్బందని భావిస్తున్నారట. కొన్ని కీలకమైన రాష్ట్రాల్లో భాజపాను విస్తరింపజేసే వ్యూహాలతో ఆయన తలమునకలై ఉన్నారనీ, ఇలాంటి సందర్భంలో రాంమాధవ్ కు కొత్త బాధ్యతలు అప్పగించడం సరికాదనే వాదన కూడా ఉంది. ఇక, తెలుగు రాష్ట్రాల విషయానికొస్తే.. తెలంగాణ, ఆంధ్రా రాష్ట్రాల పార్టీ బాధ్యతల్ని అదనంగా అప్పగిద్దామని భాజపా అధినాయకత్వం భావించిన మాట వాస్తవమే అంటున్నారు. అయితే, ఈ బాధ్యతల్ని తీసుకునేందుకు ఆయనే సుముఖంగా లేరని అంటున్నారు!
పార్టీ అంతర్గత నివేదిక ఆధారంగా చేసుకున్నాకనే రాంమాధవ్ ఈ నిర్ణయానికి వచ్చి ఉంటారనే అభిప్రాయం భాజపా వర్గాల్లో వ్యక్తమౌతోంది. ఇంతకీ ఆ నివేదిక సారాంశం ఏంటంటే… ఆంధ్రా, తెలంగాణల్లో భాజపా విస్తరణ జరగాలన్నా, వచ్చే ఎన్నికల నాటికి నిర్ణయాత్మక శక్తిగా పార్టీ ఎదగాలన్నా… ముందుగా ఈ రాష్ట్రాల్లోని భాజపా నేతల తీరు మారాలనేది! ఆంధ్రాలో భాజపా నేతలు కొందరు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి అనుయాయులుగానే వ్యవహరిస్తున్నారనీ, తెలంగాణలో కూడా అదే పరిస్థితి ఉందని నివేదికలో ఉందట! ఇలాంటి పరిస్థితుల మాధ్య తెలుగు రాష్ట్రాల బాధ్యతల్ని అదనంగా తీసుకోవడం అనవసరం అని రాంమాధవ్ భావించి ఉంటారనే అభిప్రాయం వినిపిస్తోంది! సో.. కేంద్ర మాజీ మంత్రి వెంకయ్య నాయుడు క్రియాశీల రాజకీయాల నుంచి తప్పుకున్న నేపథ్యంలో రాంమాధవ్ కు ప్రాధాన్యత ఇస్తారని అనుకున్నారు. కానీ, కేంద్రం వైఖరిని ఈ విధంగా ఉన్నట్టు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.