తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత కేసీఆర్ అధికార, రాజకీయ కార్యకలాపాలకు త్వరలోనే ముగింపు తప్పదంటూ… బీజేపీ ప్రధాన కార్యదర్శి రామ్‌మాధవ్ చేసిన హెచ్చరికలు ఇప్పుడు హైలెట్ అవుతున్నాయి. కరోనా విషయంలో… కాళేశ్వరం నిర్మాణ లోపాల విషయంలో తెలంగాణ సర్కార్ ఒత్తిడి ఎదుర్కొంటున్న సమయంలో రామ్ మాధవ్.. హెచ్చరికల్లాంటి వ్యాఖ్యలు చేయడం కలకలం రేపుతోంది. కరోనా కారణంగా… భారతీయ జనతా పార్టీ వర్చువల్ ర్యాలీలు నిర్వహిస్తోంది. అందులో భాగంగా తెలంగాణ కార్యకర్తలనుద్దేశించి మాట్లాడిన రామ్‌మాధవ్.. గతంలో ఎప్పుడూ లేనంత ఘాటుగా.. తెలంగాణ సర్కార్‌పై విమర్శలు చేశారు.
రాజకీయంగా ఎన్ని విమర్శలు అయినా చేయవచ్చు కానీ.. అధికార, రాజకీయ కార్యకలాపాలకు ముగింపు పడబోతోందని హెచ్చరించడం మాత్రం తేలికగా తీసుకోలేమనే చర్చ ఇప్పుడు తెలంగాణలో ప్రారంభమయింది. బీజేపీ హైకమాండ్ తరపున… తెలుగు రాష్ట్రాల బీజేపీ వ్యవహారాలు.. చూసేది రామ్‌మాధవే. ఆయన రాజకీయంగా పార్టీ ఎదుగుదల కోసం… కేంద్రంలో అధికారాన్ని పకడ్బందీగా ఉపయోగించుకుంటారు. గత ఎన్నికల సమయంలో… ఆయన తెర వెనుక పాత్ర చాలా కీలకం. ఇప్పటికే.. ఏపీ అధికార పార్టీకి ఢిల్లీలో ఉండే అండ ఆయనేనని చెబుతూ ఉంటారు. అదే సమయంలో.. టీఆర్ఎస్పై గతంలో రాజకీయ విమర్శలు చేశారు కానీ… కేసీఆర్ అధికార రాజకీయ కార్యకలాపాలకు ముగింపు అన్న పద్దతిలో మాత్రం ఎప్పుడూ వార్నింగ్‌లు ఇవ్వలేదు.
కాళేశ్వరంలో అవినీతి.. అన్ని చోట్లా అవినీతి అని కాంగ్రెస్ పార్టీ నేతలు పదే పదే ఆరోపిస్తున్నారు. బీజేపీకి చిత్తశుద్ధి ఉంటే.. విచారణ జరిపించాలన్న సవాళ్లు కూడా చేస్తూంటారు. అయితే.. బీజేపీ మాత్రం లైట్ తీసుకుంది. బీజేపీ ఎప్పుడూ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తుంది. ప్రజల్లో ప్రభుత్వంపై ఆగ్రహం పెరిగిపోయిన తర్వాతే కార్యాచరణ ప్రారంభిస్తుంది. ప్రస్తుతం తెలంగాణ సర్కార్ పై ప్రజల్లో ఆగ్రహం పెరుగుతోందని.. అంచనాకు వచ్చిందేమో కానీ.. బీజేపీ తదుపరి కార్యాచరణ ఖరారు చేసుకుందనే అనుమానం… రాజకీయవర్గాల్లో ప్రారంభమయింది. రామ్‌మాధవ్ హెచ్చరికలు… ఉత్తుత్తి రాజకీయ ప్రకటనలు అయితే.. పర్వాలేదు వ్యూహాత్మకంగా చేసినవి అయితే మాత్రం… తెలంగాణ రాజకీయాల్లో మార్పులు రాబోతున్నాయని అంచనా వేయవచ్చు.