రాష్ట్రపతి కోవింద్ అప్పుడే తన ముద్ర చూపడం మొదలుపెట్టారు. ఇటీవల తమిళనాడు శాసనసభ జరిపించాలంటూ అఖిలపక్ష ప్రతినిధివర్గం వెళ్లి కలిసింది. ఇదే ఆయనకు మొదటి సామూహిక భేటీ. అయితే ఆ బృందం తిరిగివచ్చేప్పుడు రాష్ట్రపతి కార్యాలయం మీరు కలసిన విషయమై మీడియాతో బయిట మాట్లాడండి.. రాష్ట్రపతి భవన్ ప్రాంగణంలో వద్దు అని చెప్పారట. చాలా ఏళ్లుగా ప్రతినిధి వర్గాలు మరీ ముఖ్యంగా ప్రముఖులు రాష్ట్రపతిని కలిశాక అక్కడ ఏర్పాటు చేసిన మైకుల ముందు మాట్లాడ్డం కద్దు. అయితే ఆ పద్ధతి ఆపేయాలని కోవింద్ నిర్ణయించారు. అలాగే తన పర్యటనల్లో మీడియాను వెంట తీసుకువెళ్లే పద్ధతికి కూడా స్వస్తి చెప్పేశారు. ప్రణబ్ ముఖర్జీ వెంట ఎప్పుడూ మీడియా బృందం వుండేది. విపిసింగ్ ప్రధానిగా వున్నప్పటి నుంచి విదేశాలకుగాని దేశంలో వివిధ రాష్ట్రాలకు గాని అధికార పర్యటనలకు వెళితే రాష్ట్రపతి ప్రధాని మీడియా ప్రతినిధులను తీసుకువెళ్లడం,విమానంలోనే మాట్టాడ్డం జరుగుతూ వస్తున్నది.మోడీ ప్రధాని అయ్యాక ఇలాటివి తగ్గించాలని చెబుతూ వస్తున్నారు. కోవింద్ మొత్తంగానే ఆపేశారు. దీనివల్ల ఖర్చు తగ్గుతుంది గాని పారదర్శకత కూడా కొరవడవచ్చు. ఏమైనా కోవింద్ కఠినతరంగానే వ్యవహరించబోతున్నారని ఈ సంకేతాలను బట్టి చెబుతున్నారు.