తొలిసారిగా బిజెపి ఆరెస్సెస్ నేపథ్యంతో రాష్ట్రపతి పదవి చేపడుతున్న రామ్‌నాథ్ కోవింద్ ప్రమాణ స్వీకారానికి ముందు తర్వాత కూడా కొంచెం బిగుసుకునే వున్నారు. ఆయన నవ్విన క్షణాలు చాలా అరుదు. ప్రమాణ స్వీకారం తర్వాత నాయకులతో కరచాలనం చేయడం కూడా యాంత్రికంగానే జరిగిపోయింది. ప్రధాని మోడీతో సహా ఎవరూ పైకి పెద్దగా స్పందించింది లేదు. కొందరు బిజెపి కాంగ్రెస్ నేతలైతే మరీ ముభావంగా కరచాలనం చేశారు. ఇవన్నీ ప్రత్యక్ష ప్రసారంలోనే కనిపించాయి. మాజీ ప్రధాని దేవగౌడ వొక్కరే సాదరంగా నమస్కరించడం ఆయన కూడా రెండవసారి నమస్కారం పెట్టడం కనిపించింది. వెంకయ్య నాయుడు అరుణ్ జైట్లీ వంటి వారి బాడీ లాంగ్వేజ్ ప్రసన్నంగా గాక ఉదాసీనంగానే వుంది. ఇక కొత్త రాష్ట్రపతి తొలి ప్రసంగంలో దార్శనికులుగా గాంధీని, సర్దార్ పటేల్‌ను, అంబేద్కర్‌ను, దీన దయాళ్ ఉపాధ్యాయను ప్రస్తావించారే తప్ప నెహ్రూను పట్టించుకోలేదు. సంఘ పరివార్‌ను సంతృప్తిపర్చడం కోసం ఒకటికి రెండు సార్లు భారత ఐతిహాసికత, పరంపర వంటివాటిని ప్రస్తావించారు. ఉపన్యాస తరహాలో ‘రిటారిక్’ గా ప్రసంగ పాఠం నడిచింది. ఏమైతేనేం- 14వ రాష్ట్రపతి జమానా ప్రారంభమైంది.