హీరో రామ్ పోతినేని, “ఇది స్వాతంత్ర దినోత్సవమా లేక స్వర్ణా ప్యాలెస్ సంఘటనకు సంబంధించిన దినమా” అంటూ ప్రశ్నించడమే కాకుండా ఈ ఘటన విషయంలో ముఖ్యమంత్రి జగన్ ని అప్రతిష్టపాలు చేసే కుట్ర దాగి ఉందేమో అంటూ అనుమానాలు వ్యక్తం చేస్తూ ట్వీట్ చేయడం సంచలనంగా మారింది. ఫైర్ సేఫ్టీ వంటి విషయాలు స్వర్ణ ప్యాలెస్ హోటల్ కి సంబంధించినవే కానీ, వీటితో రమేష్ హాస్పిటల్ కి ఏమి సంబంధం అంటూ ప్రశ్నిస్తూ ఆయన ట్వీట్ చేయడం కలకలం సృష్టిస్తోంది. వివరాల్లోకి వెళితే..
హీరో రామ్ ట్వీట్ చేస్తూ,”హోటల్ స్వర్ణ ప్యాలస్ ని రమేష్ హాస్పిటల్స్ వాళ్లు కోవిడ్ సెంటర్ గా మార్చక ముందు , ప్రభుత్వం అక్కడ క్వారంటైన్ సెంటర్ నిర్వహించింది. అప్పుడీ అగ్ని ప్రమాదం జరిగి ఉంటే ఎవరిని నిందించే వాళ్లు ? ఫైర్ + ఫీజు = ఫూల్స్ అందరినీ ఫూల్స్ చేయడానికే విషయాన్ని ఫైర్ నుంచి ఫీజు వైపు మళ్లిస్తున్నారా?
ఫీజుల వివరణ: మేనేజ్మెంట్ బాధ్యతలను నిర్వహిస్తున్న స్వర్ణప్యాలెస్ డైరెక్ట్ గా బిల్లింగ్ చేసింది. పెద్ద కుట్ర జరుగుతున్నట్టుంది!! సీఎంని తప్పుగా చూపించడానికి! @ysjagan garu.మీ కింద పనిచేసే కొంతమంది మీకు తెలియకుండా చేసే కొన్ని పనుల వల్ల మీ రెప్యుటేషన్ కీ,మీ మీద మేం పెట్టుకున్న నమ్మకానికి డ్యామేజ్ కలుగుతోంది.వాళ్ల మీద ఓ లుక్కేస్తారని ఆశిస్తున్నాం” అని రాసుకొచ్చారు.
అయితే రామ్ ట్వీట్ పై నెటిజన్ల నుండి మిశ్రమ స్పందన వస్తోంది. ముఖ్యంగా, రమేష్ హాస్పిటల్ తన బంధువుల కి సంబంధించినది కావడంతోనే రామ్ స్పందిస్తున్నారని, రామ్ ట్వీట్ అంతా రమేష్ హాస్పిటల్ ని కాపాడడం పై ఫోకస్ చేసినట్లుగా ఉంది తప్పించి బాధితులకు న్యాయం జరిపించమని ఎక్కడా ప్రస్తావించలేదని వారంటున్నారు. తెలుగు సినిమాల్లో విలన్ పాత్రలు వేసుకునే సోనూసూద్ నుండి రామ్ వంటి హీరోలు నేర్చుకోవాలని, విలన్ పాత్రలు చేసిన ఆయన తనకు ఎటువంటి ప్రతిఫలాపేక్ష లేకుండా గత కొద్ది నెలల్లో కోట్లు ఖర్చు పెడుతుంటే రామ్ వంటి హీరోలు, ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు కూడా తమ బంధువులని కాపాడడానికి మాత్రమే ముందుకు వస్తున్నారని నెటిజన్లు విమర్శిస్తున్నారు.
ఈ విమర్శలపై రామ్ ఏవిధంగా స్పందిస్తారో వేచి చూడాలి.