రామ్ – బోయపాటి కాంబినేషన్ లో ఓ సినిమా సెట్టయ్యింది. `ది వారియర్` తరవాత రామ్ చేయబోయే సినిమా ఇదే. ఈ సినిమాపై ఇప్పటి నుంచే బోలెడన్ని ఆశలు పెట్టుకొన్నడు రామ్. తన కెరీర్లో తెరకెక్కుతున్న తొలి పాన్ ఇండియా సినిమా ఇదని, అత్యధిక బడ్జెట్ తో తెరకెక్కబోయే సినిమా కూడా ఇదేనని స్పష్టం చేశాడు. బోయపాటిపై తనకెంత నమ్మకమో.. తన మాటల్లోనే చెప్పకనే చెప్పాడు. “బోయపాటికి తన హీరో నుంచి తనకేం కావాలో బాగా తెలుసు. మనం ఓ యాంగిల్ ఆలోచిస్తే ఆయన వంద కోణాల్లో ఆలోచిస్తారు. ఆఖరికి హీరో చేయి పైకి లేపితే… అది ఏ స్టైల్ లో ఉండాలి అనే విషయంలో కూడా ఆయనకు చాలా స్పష్టత ఉంటుంది. అందుకే భారమంతా ఆయనపైనే వేశా. ఆయన ఏం చెబితే అది చేస్తా“ అని రామ్ చెప్పేశాడు. దాంతో.. ఈ సినిమా విషయంలో బోయపాటికి సరెండర్ అయిపోతున్నానన్న సంకేతాలు పంపేశాడు. అది ఓ రకంగా సరైన ఎత్తుగడే. ఎందుకంటే.. తన హీరోల్ని ఎలా చూపించాలో, ఎలా చూపిస్తే ఫ్యాన్స్ కి నచ్చుతుందో బోయపాటికి బాగా తెలుసు. కథ, క్యారెక్టరైజేషన్ విషయాల్లో బోయపాటికి చాలా క్లారిటీ ఉంటుంది. ఇంకెవరైనా ఈ విషయాల్లో జోక్యం చేసుకుంటే ఫలితాలు తేడా కొడతాయి. అందుకే దర్శకుడు చెప్పినట్టు చేస్తే సరిపోతుంది. అప్పుడే మంచి ఫలితాలు వస్తాయి. రామ్ ఇప్పుడు చేస్తోంది అదే.
రామ్ తదుపరి సినిమాలు హరీష్ శంకర్, అనిల్ రావిపూడిలతో ఉండబోతున్నాయి. ఈ విషయంలోనూ కూడా స్పష్టమైన సంకేతాలు ఇచ్చేశాడు రామ్. “వారిద్దరితో సినిమాలు తప్పకుండా ఉంటాయి. కానీ అన్నీ సెట్ అవ్వాలి. అయ్యాక చెబుతా. ఇప్పుడైతే వారియర్ రిజల్ట్ కోసం ఎదురు చూస్తున్నా. ఆ వెంటనే బోయపాటి సినిమా మొదలవుతుంది. సినిమా సినిమాకీ గ్యాప్ తీసుకోవడం నాకు అలవాటు. అయితే ఈసారి అలాంటి గ్యాప్ ఏమీ తీసుకోకుండా.. సినిమా మొదలెట్టేస్తా..“ అని చెప్పుకొచ్చాడు రామ్.