తెలంగాణలో పార్టీ బలోపేతం దిశగా భాజపా పావులు కదుపుతున్న సంగతి తెలిసిందే. వచ్చే ఎన్నికల నాటికి రాష్ట్రంలో ప్రత్యామ్నాయ రాజకీయ శక్తిగా ఎదగాలన్న వ్యూహంతో ఉంది. 2024 నాటికి అధికార పగ్గాలు అందుకునే స్థాయికి ఎదగాలని భావిస్తోంది. దీంతో రాష్ట్రంలో పార్టీ విస్తరణ పనులు జోరుగా చేస్తోంది. ఇతర పార్టీల నుంచి పెద్ద ఎత్తున నాయకుల్ని ఆకర్షించాలని భాజపా జాతీయ అధ్యక్షుడు అమిత్ షా సూచించినట్టు కథనాలు వచ్చాయి. ముఖ్యంగా తెలంగాణ కాంగ్రెస్ నేతల్ని టార్గెట్ చేసుకుబోతున్నట్టు వినిపిస్తోంది. ఈ నేపథ్యంలో ఆపరేషన్ ఆకర్ష్ బాధ్యతల్ని పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి రాం మాధవ్ కు అప్పగించినట్టు సమాచారం. కాంగ్రెస్ పార్టీలోని ముఖ్యనేతలతో ఆయనే చర్చలు జరుపుతారనీ, త్వరలోనే ఆ ప్రక్రియ మొదలౌతుందని భాజపా వర్గాల్లో జోరుగా వినిపిస్తోంది.
కాంగ్రెస్ నేతలపై భాజపా చూపు ఉందనేది అంశం ఇన్నాళ్లూ తెర వెనక వ్యవహారంగా ఉండేది. కానీ, ఆ విషయంపై బహిరంగంగానే మాట్లాడేస్తున్నారు రాష్ట్ర భాజపా నేతలు. భాజపాలో చేరేందుకు కొంతమంది కాంగ్రెస్ నాయకులు సిద్ధంగా ఉన్నారంటూ కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయ చెప్పడం విశేషం. నిజామాబాద్ లో జరిగిన ఓ కార్యక్రమంలో ఈ మాటను ఆయన బహిరంగంగానే చెప్పేశారు. మాజీ పార్లమెంటు సభ్యులతోపాటు కొంతమంది ఎమ్మెల్యేలు కూడా తమతో టచ్ లో ఉన్నట్టు రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ కూడా చెప్పడం విశేషం. ఈ నేపథ్యంలో రాం మాధవ్ కు బాధ్యతలు అప్పగించడం కూడా తీవ్ర ఉత్కంఠకు కారణమౌతోంది. అంతేకాదు, భాజపాతో అంతగా టచ్ లో ఉంటున్న ఆ సీనియర్లు ఎవరనేది కూడా ఆసక్తికరంగా మారింది.
భాజపాలో ఈ వేగం ఎందుకొచ్చిందీ అంటే… ప్రస్తుతం తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో నెలకొన్న పరిస్థితిని వీలైనంత త్వరగా తమకు అనుకూలంగా మార్చుకోవాలనేది వ్యూహంగా చెప్పొచ్చు! ఎందుకంటే, కాంగ్రెస్ కు కొత్తగా వచ్చిన ఇన్ ఛార్జ్ కుంతియా ఇటీవలే హైదరాబాద్ వచ్చివెళ్లిన సంగతి తెలిసిందే. పీసీసీ అధ్యక్షుడిగా ఉత్తమ్ కుమార్ రెడ్డి కొనసాగుతారని ఆయన చెప్పడంతో కాంగ్రెస్ లోని అసంతృప్తులు పెద్ద ఎత్తున బయటపడ్డాయి. ఈ పరిస్థితిని కాంగ్రెస్ హైకమాండ్ చక్కదిద్దే లోపే వీలైనంత మందిని ఆకర్షించాలన్నది రాం మాధవ్ సూచనగా చెబుతున్నారు! వచ్చే నెలలో పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా తెలంగాణకు రానున్నారు. ఆయన సమక్షంలో కాషాయ తీర్థం పుచ్చుకునేందుకు వీలైనంతమంది కాంగ్రెస్ నేతల్ని సిద్ధం చేయాలన్నది వారి వ్యూహంగా తెలుస్తోంది. మొత్తానికి, రాష్ట్రంలో ప్రత్యామ్నాయ రాజకీయ శక్తిగా ఉందని చెప్పుకుంటూ వచ్చిన కాంగ్రెస్ పార్టీకి ఇప్పుడు భాజపా రూపంలో పెద్ద సమస్యే ఎదురు కాబోతోంది. మరి, దీన్ని హై కమాండ్ ఎలా డీల్ చేస్తుందో వేచి చూడాలి.