తెలంగాణ ప్రభుత్వం కొత్త చీఫ్ సెక్రటరీగా రామకృష్ణారావును ఖరారు చేసింది. ప్రస్తుత చీఫ్ సెక్రటరీ శాంతికుమారి ఏప్రిల్ నెలాఖరులో పదవీ విరమణ చేస్తున్నారు. ఆమెకు సమాచార హక్కు చట్టం చీఫ్ కమిషనర్ గా శాంతికుమారిని నియమించనున్నారు. చీఫ్ సెక్రటరీగా రిటైరవ్వాలన్నది ప్రతి ఒక్క ఐఏఎస్ లక్ష్యం. కానీ అందరికీ ఆ అవకాశం లభించదు. ప్రస్తుతం తెలంగాణలో ఉన్న ఐఏఎస్ అధికారుల్లో రామకృష్ణారావు సీనియర్. కానీ ఆయనకు మరో నాలుగు నెలలు మాత్రమే సర్వీస్ ఉంది. కనీసం రెండేళ్ల సర్వీస్ ఉన్న వారిని నియమించుకోవడం సంప్రదాయంగా వస్తోంది.
అయితే రామకృష్ణారావుకే సీఎం రేవంత్ ప్రాధాన్యం ఇచ్చారు. ఆర్థిక వ్యవహారాలపై పూర్తిస్థాయిలో పట్టు ఉండటం , కేంద్రం నుంచి నిధులు రాబట్టగల సామర్థ్యం ఉండటంతో ఈ ఎంపికకే మొగ్గు చూపినట్లుగా తెలుస్తోంది. రామకృష్ణారావు సర్వీసు ఆగస్టు 2025 కు పూర్తవుతుంది. ప్రధాన కార్యదర్శిగా నియమించినా నాలుగు నెలలకు మించి కొనసాగలేరు. కానీ మరో ఆరు నెలల పొడిగింపు కేంద్రం నుంచి పొందవచ్చు. చీఫ్ సెక్రటరీ పోస్టు కోసం జయేశ్ రంజన్, వికాస్ రాజ్ పేర్లు కూడా పరిశీలనలోకి వచ్చాయి.
జయేశ్.. ప్రస్తుతం కీలక బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. పెట్టుబడుల ఆకర్షణకు ఆయన అనుభవం కీలకంగా ఉంది. అయితే ఆయన సర్వీసు రెండున్నర ఏళ్ల వరకు ఉంది. రామకృష్ణారావు తర్వాత అయినా ఆయనకు అవకాశం లభించనుంది. వికాస్ రాజ్ కు ఏ అవకాశం కల్పిస్తారన్నది చూడాల్సి ఉంది. మరో వైపు చీఫ్ సెక్రటరీ నియామకంతో పాటు పలువురు ఐఏఎస్‌లను బదిలీ చేశారు . స్మితా సభర్వాల్‌కు ఫైనాన్స్ కమిషన్ మెంబర్ సెక్రటరీగా బదిలీ చేశారు.