వచ్చే ఎన్నికలలోగా కడపజిల్లాలో తెదేపాను బలోపేతం చేసుకోవాలనే ఆలోచనతో ఆ జిల్లాలోని జమ్మలమడుగు వైకాపా ఎమ్మెల్యేని పార్టీలో చేర్చుకోవాడానికి చంద్రబాబు నాయుడు సిద్దం అవుతున్నారు. కానీ అందుకు అదే జిల్లాకు చెందిన తెదేపా సీనియర్ నేత మాజీ మంత్రి రామసుబ్బారెడ్డి తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. చంద్రబాబు నాయుడు ఆయనను ఒప్పించే ప్రయత్నం చేసారు. అందుకు ఆయన అయిష్టంగానే అంగీకరించినట్లు తెలుస్తోంది.
రామసుబ్బారెడ్డి మీడియాతో మాట్లాడుతూ “చంద్రబాబు నాయుడు రాష్ట్రం కోసం ఆలోచిస్తుంటే నేను నా జమ్మలమడుగు గురించి ఆలోచిస్తాను. పార్టీలో నా గౌరవానికి భంగం కలగనంతవరకే కొనసాగుతాను. ఒకవేళ పార్టీలో ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కోవలసి వస్తే నా నియోజక వర్గం ప్రజలు, నా అనుచరులతో చర్చించి తగిన నిర్ణయం తీసుకొంటాను,” అని చెప్పారు.
అంటే నేటికీ ఆయన ఆదినారాయణ రెడ్డి చేరికను వ్యతిరేకిస్తూనే ఉన్నారని స్పష్టం అవుతోంది. “నేను జమ్మలమడుగు గురించి మాత్రమే ఆలోచిస్తానని” ఆయన చెప్పడం దేనికంటే పార్టీ కంటే తన రాజకీయ పునాదిని కాపాడుకోవడానికే ప్రాధాన్యతనిస్తానని చెప్పినట్లుగానే భావించవచ్చును. ఒక ఒరలో రెండు కత్తులు ఇమడలేనట్లే, ఒకే నియోజకవర్గం నుండి ఇద్దరు పెద్ద రాజకీయనేతలు ఒకే పార్టీలో ఇమడటం చాలా కష్టమవుతుంది. కనుక ఒకవేళ ఆదినారాయణ రెడ్డిని తెదేపాలో చేర్చుకొన్నట్లయితే, రామసుబ్బారెడ్డిని వదులుకోవడానికి చంద్రబాబు నాయుడు సిద్దపడ్డారనుకోవలసి ఉంటుంది. అదే జరిగితే, ఒక బలమయిన నేత కోసం మరో బలమయిన నేతను పోగొట్టుకోవడం వివేకమనిపించుకొంటుందా? అని తెదేపాయే ఆలోచించాలి.