తెలుగు360 రేటింగ్ : 1.75/5
రొటీన్ కథలకు కాలం చెల్లిపోయింది. ఆ వాసన ఏమాత్రం వచ్చినా జనం నిర్మొహమాటంగా తిరస్కరిస్తున్నారు. పైగా.. ఇది ఓటీటీల కాలం. ప్రపంచ సినిమా మొత్తం అందుబాటులో ఉంది. అన్ని భాషల్లోనూ వస్తున్న కంటెంట్ ని ప్రేక్షకులు ఓ కంట కనిపెడుతూనే ఉన్నారు. వాటితో పోలికలు మొదలవుతున్నాయి. అందుకే.. మేకర్స్ చాలా జాగ్రత్తగా ఉండాలి. కొత్తదనానికి పెద్ద పీట వేయాలి. రొటీన్ కంటెంట్ ఎంచుకొంటే… దాన్ని మసిపూసి, మరేడుకాయ చేసే నేర్పు ఉండాలి. ఇవి రెండూ లేకపోతే… సినిమాలు ఏమవుతాయో.. ఈమధ్య కాలంలో వచ్చిన, వస్తున్న సినిమాల ఫలితాలే చెప్పేశాయి. గోపీచంద్ కూడా రొటీన్ కథలకు బలైన హీరోనే. ఈమధ్య తనకు ఫ్లాపులు రావడానికి అదే కారణం. దర్శకుడు శ్రీవాస్ కూడా.. విజయాలకు చాలా దూరంగా ఉన్నాడు. కాకపోతే వీరిద్దరిదీ హిట్ కాంబో. అందుకే.. ఇద్దరూ కలిసి సినిమా చేస్తున్నారంటే కచ్చితంగా వాటిపై అంచనాలు ఏర్పడతాయి. రామబాణం లాంటి పాజిటీవ్ టైటిల్, జగపతిబాబు, ఖుష్బూలాంటి తారాగణం ఈ సినిమాకి ప్లస్ అయ్యింది. మరి.. ఇంత హైప్ క్రియేట్ చేసిన రామబాణం… లక్ష్యాన్ని ఛేదించిందా? లేదా? రొటీన్ కథలతో విసిగెత్తించిన గోపీచంద్ – ఈసారైనా పంథా మార్చాడా?
రాజారామ్ (జగపతిబాబు) రఘుదేవపురంలో ఆర్గానిక్ హోటెల్ నిర్వహిస్తుంటాడు. తమ్ముడు విక్కీ (గోపీచంద్) చిన్నప్పుడే అన్నయ్యతో గొడవ పడి ఇంటి నుంచి పారిపోతాడు. కొలకొత్తాలో డాన్‌గా ఎదుగుతాడు. అక్కడ భైరవి (డింపుల్ హయతి)తో ప్రేమలో పడతాడు. అయితే…భైరవి తండ్రి (సచిన్ ఖేడ్కర్) తనకు కాబోయే అల్లుడికి పెద్ద కుటుంబం ఉండాలన్న కండీషన్ పెడతాడు. భైరవిని పెళ్లి చేసుకోవాలన్న మిషన్‌తో… మళ్లీ తన కుటుంబానికి దగ్గరవ్వాలన్న ప్రయత్నంలో రఘువేవరపురంలో అడుగు పెడతాడు విక్కీ. అయితే ఆ సమయానికి రాజారామ్ కి జీకే (తరుణ్ అరోరా) గ్యాంగ్ నుంచి ముప్పు ఏర్పడుతుంది. అదేంటి? అందులోంచి విక్కీ తన కుటుంబాన్ని ఎలా కాపాడుకొన్నాడు? అనేదే మిగిలిన కథ.
లక్ష్యం, లౌక్యం సినిమాలతో రెండు హిట్లు కొట్టారు గోపీచంద్ – శ్రీవాస్. దాదాపు ఏడేళ్ల తరవాత ఈ కాంబినేషన్ మళ్లీ కుదిరింది. ఈసారి కూడా ఏదో మ్యాజిక్ చేస్తారని ఆశించడంలో తప్పేం లేదు. కాకపోతే.. రొటీన్ స్టఫ్‌తో.. శ్రీవాస్ పెద్ద రిస్క్ చేశాడు. కమర్షియల్ మీటర్లో సినిమా తీయాలన్న ఉద్దేశంలో పాటలు, ఫైట్లూ, ఎలివేషన్లూ.. ఇదే స్కేల్ తో సినిమాని నడిపించుకొంటూ పోయి.. వాటి మధ్య అంతర్లీనంగా ఉండాల్సిన కథని గాలికి వదిలేశాడు. కమర్షియల్ మీటర్లో సినిమా తీయాలనుకోవడంలో తప్పు లేదు. పాటలు, ఫైట్లు, కామెడీ, రొమాన్స్ ఇవన్నీ పేర్చుకొంటూ వెళ్లడానికి.. వాటిని నిలబెట్టడానికి ఓ కథంటూ ఉండాలి కదా..? అది పరమ రొటీన్, పాత చింతకాయ పచ్చడి టైపు స్టోరీ అయిపోయింది. ట్రీట్మెంట్ విషయంలోనైనా కాస్త జాగ్రత్తగా ఉండాల్సింది. కట్ చేస్తే పాట, కోపం వస్తే ఫైటు, మూడొస్తే రొమాన్స్ అన్నట్టు.. ఎక్కడికక్కడ అతుకుల బొంతలా ఈ సినిమాని అల్లేశారు.
చిన్నప్పటి ఎపిసోడ్ తో సినిమా కాస్త ఎమోషనల్‌గానే మొదలవుతుంది. అయితే.. విక్కీ కొలకొత్తా వెళ్లిపోవడం, అక్కడ డాన్ గా అవతరించడం.. ఇలాంటి సన్నివేశాలు ప్రేక్షకుల్లో ఉత్కంఠతనీ, ఆసక్తిని కలిగించలేవు. హోటెల్ బిజినెస్‌లో పోటీ, జగపతిబాబు వ్యాపారాన్ని దెబ్బకొట్టడానికి విలన్ చేసే ప్రయత్నాలు.. ఇవన్నీ 1980ల నాటి సినిమాల్ని, అప్పటి ట్రిక్కుల్నీ గుర్తు చేస్తాయి. ఓచోట డాన్‌గా వెలిగిన వాడు.. మరోచోటకొచ్చి.. అస్త్ర సన్యాసం చేసినట్టు బిల్డప్ ఇచ్చే సీన్లు ఇంకెన్ని చూడాలో..? ఇంట్రవెల్ బ్యాంగ్ లో కాస్త ఊపొస్తుంది. మాస్ కి కావల్సిన ఎలిమెంట్స్ ఆ సీన్లో ఉన్నాయి. అయితే.. సినిమా అనే ప్యాకేజీలో అక్కడక్కడ హై.. ఇస్తే చాలదు. సినిమా అంతా.. హైవే పై రైడ్‌లా సాగిపోవాలి. అది.. ఇక్కడ జరగలేదు.
అనుకొంటాం కానీ… ఫ్యామిలీ ఎమోషన్స్‌ని పండించడం కష్టమే. తెరపై జగపతిబాబు, ఖుష్బూ లాంటి తారాగణం ఉంటే సరిపోదు. వాళ్ల మధ్య బాండిగ్ చూపించగలగాలి. ఆ పాత్రలు బాధ పడితే.. ప్రేక్షకుడు ఫీల్ అవ్వాలి. ఆ ఎమోషన్ మిస్సయితే.. తెరపై ఎంతమంది కాస్టింగ్ ఉన్నా, ఎంత సెంటిమెంట్ పండిస్తున్నా… టీవీ సీరియల్లానే అనిపిస్తుంది. కొన్ని సీన్లు మరీ అతిగా అనిపిస్తాయి. గోపీచంద్ ఫోన్లోనే చేసే రూ.50 కోట్ల సెటిల్మెంట్ సీన్ అందుకు మచ్చుతునక. `రామబాణం`లో ఫ్యామిలీ ఎమోషన్స్ కూడా మిస్‌ఫైర్ అయి… అవి కామెడీగా మారిపోయాయి. కామెడీ అంటే గుర్తొచ్చింది… ఈ సినిమాలో కావల్సినంతంమంది కామెడీ గ్యాంగ్ ఉంది. కానీ… వాళ్లతో దర్శకుడు కామెడీనే పండించలేకపోయాడు. ముతక జోకులు, వాడేసిన సెటైర్లూ… మళ్లీ వాడితే – ఇక ఫన్ ఎక్కడి నుంచి పండుతుంది. వెన్నెల కిషోర్ లాంటి మంచి టైమింగ్ ఉన్న ఆర్టిస్టు కూడా సైలెంట్ అయిపోయాడు. సెకండాఫ్‌లో హీరో -విలన్ మధ్య గేమ్ ఇంట్రెస్టింగ్ గా ఉండాల్సింది. ఆ సీన్లు పేలవంగా మారిపోయాయి. దాంతో.. ఇద్దరిలో ఎవరు గెలిస్తే నాకేంటి? అనే మైండ్ సెట్ కి వెళ్లిపోతాడు ప్రేక్షకుడు. చివర్లో ఆర్గానిక్ ఫుడ్ గురించీ, సేంద్రియ వ్యవసాయం గురించి నాలుగు మాటలు చెప్పి పంపించారు.
గోపీచంద్‌కు ఇది అలవాటైన పాత్రే. స్టైలీష్ గా ఉన్నాడు. డాన్సుల్లో, ఫైట్స్‌లో కష్టపడ్డాడు. అయితే.. తెరపై ఎంత అందంగా కనిపిస్తున్నాను అనేది పాయింట్ కాదు. ఎంతటి ప్రభావవంతమైన పాత్రలు ఎంచుకొంటున్నాను? అనేదే ముఖ్యం. గోపీచంద్ ఈ విషయంపై మరింత ఫోకస్ పెట్టాలి. జగపతిబాబు పాజిటవ్ పాత్రలో మెప్పించాడు. ఆయన వల్ల ఆ పాత్రకు కాస్త హుందాతనం వచ్చింది. ఖుష్బూ ఓకే. విలన్ గ్యాంగ్ పెద్దదే ఉన్నా.. ఫలితం లేదు. వాళ్లంతా తేలిపోయారు. డింపుల్ హయతి పాటల్లో ఒకలా, సీన్స్‌లో ఒకలా కనిపించింది. ఆమె కెరీర్‌కు ఈ సినిమా ఏమాత్రం ఉపయోగపడదు.
సినిమా బాగా రిచ్‌గా ఉంది. ఫ్రేముల్లో, షాట్స్ లో బడ్జెట్ కనిపిస్తోంది. కెమెరా పనితనం చూడముచ్చటగా ఉంది. పాటలు ఓకే. కాకపోతే.. దర్శకుడు కథపై కసరత్తు చేయలేదు. భూపతి రాజా ఇచ్చిన కథని.. శ్రీవాస్ ఓన్ చేసుకోలేకపోయాడు. ఈతరానికి నచ్చేట్టు మలచలేకపోయాడు. ప్రతీసారీ కొత్త కథే చెప్పాలన్న రూల్ లేదు. పాత కథని.. పాలీష్గా చెప్పొచ్చు. కానీ.. శ్రీవాస్ ఈ విషయంలో విఫలమయ్యాడు. లక్ష్యం, లౌక్యం చిత్రాలతో హిట్ కాంబోగా పేరు తెచ్చుకొన్న ఈ ద్వయం రికార్డుకు… రామబాణంతో బ్రేక్ పడినట్టైంది.
ఫినిషింగ్ టచ్: లక్ష్యం తప్పిన బాణం
తెలుగు360 రేటింగ్ : 1.75/5