గత ఎన్నికల్లో పుంగనూరు నుంచి జనసేన పార్టీ తరపున పోటీ చేసి ఓడిపోయిన రామచంద్రయాదవ్ ఇటీవలి కాలంలో చేస్తున్న హంగామా అంతా ఇంతా కాదు. కానీ ఆయన జనసేనలో లేరు. సొంత పార్టీ పెడుతున్నారు. గుంటూరులో నాగార్జున యూనివర్శిటీ ముందు ఏర్పాటు చేసిన బహిరంగసభలో పార్టీని ప్రకటించబోతున్నారు. ఇందు కోసం ఆయన చేస్తున్న ఏర్పాట్లు భారీగా ఉన్నాయి. పత్రికల్లో రూ. కోట్లు వెచ్చించి ఫుల్ పేజీ ప్రకటనలు ఇస్తున్నారు. భారీ జన సమీకరణకు కూడా ఏర్పాట్లు చేసుకున్నారని చెబుతున్నారు.
రామచంద్ర యాదవ్ మామూలు నేత కాదు. ఆయన అతి సాదాసీదాగా కనిపిస్తారు కానీ..ఏపీ బయట చాలా పలుకుబడి ఉన్న నేతనే. పెద్ద పెద్ద వాళ్లకే అమిత్ షా అపాయింట్ మెంట్లు దొరకవు ఈయన సులువుగా సమావేశమవుతారు… అంతే కాదు వై ప్లస్ సెక్యూరిటీ తెచ్చుకుంటారు. ఇప్పుడు ఆ పార్టీ.. ఈ పార్టీ అని కాకుండా నేరుగా సొంత పార్టీ పెడుతున్నారు. పుంగనూరులో విస్తృతంగా తిరుగుతున్నారు. అయితే పెద్దిరెడ్డి రాజ్యంలో దాడులు చేయడం మాత్రమే రాజకీయం. అందుకే ఈయన ఇంటిపైనా దాడులు చేయించారు. అయినా వెనక్కి తగ్గడం లేదు .
రామచంద్ర యాదవ్ ఏదో ఓ పార్టీలో చేరి టిక్కెట్ పొందవచ్చు. జనసేన పార్టీ రెడీగానే ఉంది.కానీ ఎందుకో ఆయన కొత్త పార్టీ వైపు మొగ్గారు. బీజేపీ పెద్దలతో సన్నిహిత సంబంధాలుంటే ఆ పార్టీలో చేరవచ్చు. కానీ ఆయన రాజకీయ అడుగులు ఆసక్తికరంగా ఉన్నాయి. ఆయన వెనుక ఏదో బలమైన శక్తి ఉందని అనుకుంటున్నారు. వారెవరో తెలియాల్సి ఉందని రాజకీయవర్గాలు లెక్కలేస్తున్నారు.