ఇంతవరకు జగన్మోహన్ రెడ్డే తన పార్టీకి శల్య సారధ్యం వహిస్తున్నారని విమర్శలు వినిపిస్తుండేవి. కానీ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా శల్య సారధ్యం వహిస్తున్నారని ఆరోపిస్తున్నారు కాంగ్రెస్ ఎమ్మెల్సీ సి రామచంద్రయ్య. అయితే తెదేపాకో..రాష్ట్రానికో కాదు.. ప్రత్యేక హోదా విషయంలో మాత్రమేనని చెప్పడం కొంత ఊరటనిచ్చే విషయమే.
ప్రత్యేక హోదా విషయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రోజుకో మాట చెపుతూ శల్య సారధ్యం చేస్తున్నారని ఆరోపించారు. ఒకసారి దానిని సాధించేవరకు పోరాటం కొనసాగిస్తామని, ఒకసారి అది లేకపోతే ఏమైనా నష్టమా అని, ప్రత్యేక హోదా పొందిన రాష్ట్రాలు ఏమి అభివృద్ధి సాధించాయని రకరకాలుగా మాట్లాడుతూ ప్రజలను చాలా గందరగోళపరుస్తున్నారని రామచంద్రయ్య ఆరోపించారు. హోదా సాధించలేకపోయినా కనీసం రాష్ట్రానికి ఆర్ధిక ప్యాకేజి కూడా సాధించలేకపోయారని ఎద్దేవా చేశారు.
రామచంద్రయ్య చెపుతున్న మాటలు వాస్తవమే. ప్రత్యేక హోదా రాదనే సంగతి ముఖ్యమంత్రికి చాలా కాలం క్రితమే తెలుసు. ఆయనకి తెలుసనే విషయం ప్రజలకి కూడా తెలుసు. ఆ సంగతి కూడా ఆయనకి తెలుసు. ఈ అంశం గురించి కేంద్ర ప్రభుత్వం, భాజపా రెండూ కూడా తమ అభిప్రాయం కుండ బ్రద్దలు కొట్టినట్లు బహిరంగంగానే చెప్పేసాయి. అయినా చంద్రబాబు మాత్రం ఇంకా ప్రజలతో దాగుడు మూతలు ఆడుతూనే ఉన్నారు. వచ్చే ఎన్నికల నాటికి భాజపాతో తెగతెంపులు చేసుకోవలసి వచ్చినా లేదా భాజపాయే తెదేపాతో తెగతెంపులు చేసుకొన్నా అప్పుడు ఈ ప్రత్యేకాస్త్రాన్ని బయటకు తీసి దానిపై ప్రయోగించాలనే ఉద్దేశ్యంతోనే దాని గురించి తన వైఖరి స్పష్టం చేయడం లేదేమో? కానీ ఆ ప్రయత్నంలో ఆయన ప్రజలతో ఇలాగే దాగుడు మూతలు ఆడితే చివరికి ఆయన తన పార్టీకి తనే శల్య సారధ్యం చేసుకొంటున్నట్లవుతుందేమో ఆలోచించుకొంటే మంచిది కదా.