తెలంగాణలో బీజేపీ – టీఆర్ఎస్ మధ్య మరో వివాదం ప్రారంభమయింది. హోంశాఖ సహాయమంత్రి కిషన్ రెడ్డి తెలంగాణ డీజీపీపై తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. అధికారికంగా వివరణ కోరాలని నిర్ణయించుకున్నారు. కిషన్‌రెడ్డితో పాటు బీజేపీ హైకమాండ్‌కు సైతం తీవ్ర ఆగ్రహం తెప్పించిన ఘటన రామగుండంలో జరిగింది. రెండు రోజుల కిందట… కేంద్ర మంత్రి మన్సుఖ్ మాండవీయతో కలిసి కిషన్ రెడ్డి అధికారిక పర్యటన కోసం… రామగుండం ఎరువుల ఫ్యాక్టరీకి వచ్చారు. నిజానికి అక్కడ ఎరువుల ఫ్యాక్టరీ వల్ల ప్రజలకు మేలు జరుగుతుంది. గతంలో మూతపడిన పరిశ్రమ.. కేంద్ర ప్రభుత్వ చొరవతో మళ్లీ ఉత్పత్తి దశకు వచ్చింది. త్వరలో ట్రయల్ రన్ ఉత్పత్తి ప్రారంభం కాబోతోంది. అయితే.. ఇది బీజేపీకి అడ్వాంటేజ్ అవుతుందని అనుకున్నారేమో కానీ టీఆర్ఎస్ నేతలు.. కేంద్రమంత్రుల పర్యటనకు అడ్డుపడ్డారు. పెద్ద ఎత్తున కార్యకర్తల్ని సమీకరించి.. బీజేపీకి వ్యతిరేకంగా ప్రదర్శన నిర్వహించారు.
ప్యాక్టరీ గేటు వద్ద.. బీజేపీ కార్యకర్తల కన్నా.. టీఆర్ఎస్ కార్యకర్తలు వందల మంది ఎక్కువగా గుమికూడారు. అధికారిక పర్యటన అయినా… కేంద్ర మంత్రి ఫ్యాక్టరీ పర్యటనకు భద్రత కల్పించడంలో పోలీసులు విఫలమయ్యారు. టీఆర్ఎస్ నేతలు.. అడ్డుకుంటామని ప్రకటనలు చేసినా.. వారిని నియంత్రించడానికి ప్రాధాన్యం ఇవ్వలేదు. కేంద్రమంత్రులు ఫ్యాక్టరీలోకి వెళ్లడానికి ఇబ్బందిపడ్డారు. కారు దిగి నడుచుకుంటూ లోపలకు వెళ్లాల్సి వచ్చింది. తర్వాత రివ్యూ మీటింగ్‌కు కూడా హాజరు కాలేకపోయారు. పోలీసులు టీఆర్ఎస్ కార్యకర్తల్ని ఉద్దేశపూర్వకంగా నియంత్రించకపోవడం వల్లే ఇలాంటి పరిస్థితులు ఏర్పడ్డాయని కిషన్ రెడ్డి అంచనాకు వచ్చారు.
ఢిల్లీ వెళ్లిన తర్వాత ఆయన అధికారికంగా పోలీసులు వ్యవహరించిన తీరుపై చర్యలు తీసుకోవాలని నిర్ణయించారు. నేరుగా డీజీపీ మహేందర్ రెడ్డికి తన అసంతృప్తిని తెలియచేశారు. అక్కడ జరిగిన భద్రతా పరమైన పొరపాట్లపై నివేదిక పంపాలని ఆదేశించారు. దీనిపై కిషన్ రెడ్డి బాధ్యులపై చర్యలు తీసుకునే వరకూ ఊరుకోకూడదని భావిస్తున్నారు. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా ఉన్న తన పర్యటనకే పోలీసులు భద్రత కల్పించకపోతే.., భవిష్యత్‌లో బీజేపీ నేతలు ఏ కార్యక్రమాన్ని చేపట్టలేరని ఆయన భావిస్తున్నారు. ఇప్పటికే తెలంగాణలో ప్రతిపక్షాల రాజకీయ ఆందోళనలపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు.ఏ కార్యక్రమం జరగకుండా ముందస్తు అరెస్టులు చేస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి.