డా.సి.నారాయణ రెడ్డికీ ఎన్టీఆర్‌కీ మంచి అనుబంధం ఉంది. కవిగా పేరు తెచ్చుకుంటున్న సినారెని సినిమాల్లోకి ఆహ్వానించింది, తొలి అవకాశం ఇచ్చింది ఎన్టీఆరే. ఎన్టీఆర్ ప్రతీ సినిమాలోనూ… మరీ ముఖ్యంగా జానపద, పౌరాణిక చిత్రాల్లో సి.నా.రె ఒక్క పాటైనా రాసేవారు. సంస్క్కృత సమాసాలతో సాగే క్లిష్టమైన పాటలెన్నో సినారేనే రాశారు. ఇప్పుడు `ఎన్టీఆర్` బయోపిక్‌లోనూ సి.నా.రె పాత్రకు ప్రాధాన్యం ఇచ్చారు క్రిష్. ఈ పాత్రలో.. ఇప్పటి ప్రముఖ గీత రచయిత రామజోగయ్యశాస్త్రి కనిపించనున్నారు. ఆయన కనిపించేది ఒకట్రెండు సన్నివేశాలే. అయితే… అప్పట్లో ఎన్టీఆర్ – సినారెల అనుబంధానికి ఆ సీన్లు మచ్చు తునకలుగా కనిపిస్తాయని సమాచారం. మరో రచయిత బుర్రా సాయిమాధవ్ కూడా `ఎన్టీఆర్` బయోపిక్‌లో నటిస్తున్నారన్న సంగతి తెలుగు 360 ముందే చెప్పింది. ఇప్పుడు ఈ సినిమాలో నటుడిగా మరో రచయితని చూపించబోతున్నారన్నమాట. రానా, విద్యాబాలన్, రకుల్‌ప్రీత్ సింగ్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. `ఎన్టీఆర్` బయోపిక్‌లోని తొలిభాగం ఈ సంక్రాంతికి విడుదల అవుతుంది. ఆ పార్ట్ కి సంబంధించిన షూటింగ్ దాదాపు 90 శాతం పూర్తయింది. మరో పది రోజుల్లో `ఎన్టీఆర్ – కథానాయకుడు`కి సంబంధించిన షూటింగ్ మొత్తం పూర్తి కానున్నదని తెలిసింది.