గ్రేటర్ పరిధిలో బీఆర్ఎస్ మంచి విజయం సాధించింది. అభివృద్ధి చేశామని బీఆర్ఎస్ చెప్పుకున్నదంతా హైదరాబాద్ పరిధిలోనే. రామక్క రీల్స్ చేసినవి.. డ్రోన్ షాట్స్ అన్నీ హైదరాబాద్ వే. బీఆర్ఎస్ ప్రచార వ్యూహాలన్నీ కేటీఆర్ చేతుల మీదుగానే నడిచాయి. ఆన్ లైన్.. ఆఫ్ లైన్ మీడియా ప్రచారాల బాధ్యత కేటీఆర్ తీసుకున్నారు. ప్రతి నియోజకవర్గానికి వార్ రూమ్ ఏర్పాటు చేసుకున్నారు. అభ్యర్థికో ప్రచార వ్యూహం అమలు చేశారు. కానీ అవన్నీ అతిగా ఉన్నాయన్న అభిప్రాయం అప్పుడే వినిపించింది. చివరికి ఓటమికి కారణాల్లో ఆన్ లైన్ ప్రచారం కూడా ఓ కారణంగా మిగిలిపోయిందని అనుకోవచ్చు. ఫలితంగా గ్రామీణ ప్రాంతాల్లో ఏమీ చేయలేదన్న అసంతృప్తి ప్రజల్లో పెరిగిపోయింది. కేసీఆర్ ఆన్ లైన్ లో సోషల్ మీడియాలో ట్రెండ్ అయితే చాలు ఇక ఓట్లు వెల్లువే అన్న ఓ అభిప్రాయంలో ఉన్నారు.
అందుకే ఆయన రామక్క రీల్స్ చేయించారు. ఒక్క రామక్క రీల్ ను బీఆర్ఎస్ ప్రమోట్ చేసిన విధానం చూస్తే ఎవరికైనా ఆశ్చర్యం వేస్తుంది. అన్ని ప్రముఖ దేశాల్లో ప్రముఖ కట్టడాల నుంచి సోషల్ మీడియా ఇన్ ఫ్లూయన్సర్లు రీల్స్ చేశారు. తెలంగాణలో అయితే ప్రతి సోషల్ మీడియా సెలబ్రిటీ అదే చేశారు. చివరికి వారందరూ డ్రగ్స్ కేసుల్లో.. ఇతర కేసుల్లో నిందితులుగా ఉన్న వారేనని.. బెదిరించి చేయించారని ఇతర పార్టీలు ఆరోపించే పరిస్థితి వచ్చింది. మొదట్లో వైరల్ అనిపించినా.. అవి సామాన్యులతో కనెక్షన్ కట్ అయ్యేలా చేసింది. చివరికి వెగటు పుట్టిందన్న అభిప్రాయం కూడా వినిపించింది. ఈ ఎన్నికల్లో సోషల్ మీడియాలో వైరల్స్ కోసం బీఆర్ఎస్ స్ట్రాటజిస్టుగా ఎవరు పని చేశారో కానీ.. అబ్యర్థులతో కూడా రీల్స్ డాన్సులేయించారు.
ప్రచార సమయంలో రామక్క రీల్స్ తో డాన్స్ లేయించారు.. చివరికి ఎన్నికలకు ముందు 30వ తారీఖున మన వేలికి ఇంకు.. రాష్ట్రమంతా పింకు అని హడావుడి చేశారు. అందరూ రీల్స్ చేశారు. ఇవన్నీ సాధారణ ఓటర్లకు చేరలేదు. సోషల్ మీడియా లో ఉండేవాళ్లకూ వెగటు పుట్టి ఓట్లేయలేదని ఫలితాలతో వెల్లడయింది. ఏదైనా గీత లోపలే ఉండాలి.. అతిగా మారితే మొదటికే మోసం వస్తుంది. ఆన్ లైన్, సోషల్ మీడియాప్రచారాలతో.. వైరల్ కంటెంట్ తో ఓట్లు వచ్చేస్తాయని.. కేటీఆర్ స్ట్రాటజీ మాత్రం ఘోరంగా ఫెయిలయిందని అర్థం చేసుకోవచ్చు.