Ramam Raghavam movie review
తెలుగు360 రేటింగ్: 2.5/5
‘జబర్దస్త్’ నుంచి వచ్చిన వాళ్లు చాలామంది కమెడియన్లుగా స్థిరపడ్డారు. ఇంకొంతమంది చిత్రసీమలో ఇంకా పోరాటం చేస్తూనే ఉన్నారు. అక్కడి నుంచే వచ్చిన వేణు ‘బలగం’ తీసి అందరినీ ఆశ్చర్యపరిచాడు. వీళ్లలో ఇంత టాలెంట్ ఉందా? అనుకొనేలా చేశాడు. ధన్ రాజ్ కూడా దర్శకుడిగా ఓ సినిమా చేస్తుంటే – కాస్తో కూస్తో అటెన్షన్ పెరగడానికి ‘బలగం’ ఓ కారణం. ‘బలగం’లో వేణు కేవలం దర్శకత్వానికే పరిమితం అయితే.. ధన్ రాజ్ ఈసారి ప్రధాన పాత్ర కూడా తానే పోషించాల్సివచ్చింది. మరి ఈ జోడెడ్లబండి ప్రయాణం ఎలా సాగింది? ‘బలగం’ చూసిన కళ్లతో ‘రామం రాఘవం’ చూస్తే.. జనాలకు నచ్చుతుందా? నటుడిగా ఇన్నాళ్లూ పాస్ అయిపోతున్న ధన్ రాజ్ దర్శకుడిగా ఎన్ని మార్కులు తెచ్చుకొన్నాడు?
దశరథ రామం (సముద్రఖని) రిజిస్టార్ ఆఫీసులో పని చేసే ఉద్యోగి. చాలా నిజాయతీ పరుడు. తన కొడుకు రాఘవ (ధన్‌రాజ్) అంటే చాలా ఇష్టం. ఆమాటకొస్తే ప్రాణం. రాఘవకు చదువు అబ్బలేదు. ఉద్యోగం కూడా లేదు. చెడు వ్యసనాలు కావల్సినన్ని ఉన్నాయి. ‘బాగుపడరా’ అని తండ్రి ఎంత చెబుతున్నా చెవికి ఎక్కించుకోడు. వ్యాపారం చేస్తానని చెప్పి రూ.5 లక్షలు తీసుకొని జూదంలో పోగొడతాడు. పెట్రోలు బంకులో పనికి కుదిరి, అక్కడ కూడా అదే తీరు. పది లక్షలు అప్పు చేసి, ప్రాణాల మీదకు తెచ్చుకొంటాడు. చివరికి తండ్రి సంతకాన్ని ఫోర్జరీ చేసి జైలు పాలవుతాడు. ఆఖరికి డబ్బు కోసం, ఆస్తి కోసం, ఉద్యోగం కోసం.. తండ్రినే చంపాలనుకొంటాడు. మరి ఆ పధకం పారిందా? అందుకోసం రాఘవ ఏం చేశాడు? చివరికి ఏం తెలుసుకొన్నాడు? అనేదే ‘రామం.. రాఘవం’.
తండ్రీ కొడుకుల కథ కంటే త్వరగా కనెక్ట్ అయిపోయే ఎలిమెంట్ ఏముంటుంది? దర్శకుడిగా తన తొలి ప్రయత్నంలో మంచి కనెక్టింగ్ పాయింట్ తీసుకొన్నాడు ధన్ రాజ్. ఓ మంచి తండ్రికి, అన్ని అవలక్షణాలూ ఉన్న కొడుకు ఉంటే ఎలా ఉంటుందన్నదే కథ. ఆ తండ్రీ కొడుకుల ప్రయాణం చివరి మజిలీ ఏమైఉంటుందన్న ఆసక్తి తొలి సన్నివేశం నుంచే రేకెత్తించాడు. ప్రారంభంలోనే కథలోకి వెళ్లిపోయాడు దర్శకుడు. తండ్రి – కొడుకుల మధ్య గ్యాప్ రావడానికి కారణాలేమిటన్నది బలంగానే చూపించాడు. రాఘవ పాత్రలో నెగిటీవ్ కోణాలు ఎక్కువ. రోజు రోజుకీ దిగజారిపోతున్న రాఘవని చూసి ముందు కోపం వస్తుంది. ఆ తరవాత భయం వేస్తుంది. ‘తండ్రినే చంపాలి’ అనుకొన్న అతని నిర్ణయం ఎవ్వరినీ ఆశ్చర్యపరచదు. రాఘవ తీరే అంత.. అన్నట్టుగా ఆ పాత్రని ప్రేక్షకులకు అలవాటు చేశాడు దర్శకుడు.
రాఘవ మంచివాడిగా మారిపోతున్నాడా? అనే ఆనందం ప్రేక్షకుల్లో కలిగించి, అంతలోనే తనలోని మరో నెగిటీవ్ కోణాన్ని బయటకు తీసుకొస్తుంటాడు. ఈ నేపథ్యంలో సన్నివేశాల్ని మలిచిన విధానం ఆకట్టుకొంటుంది. చివరి 20 నిమిషాలూ కథని నడిపించిన తీరు కూడా బాగుంది. ఆసుపత్రిలో సముద్రఖని ముందు ధన్ రాజ్ చెప్పిన డైలాగులు ఎమోషన్‌గా పట్టేస్తాయి. ‘నువ్వెక్కడ క్షమించేస్తావేమో అని భయంగా ఉంది, చెట్లకు నీళ్లు పోస్తూ… ముళ్ల కంపకు కూడా పొరపాటున నీళ్లు పోసి పెంచావ్’ అని చెప్పినప్పుడు – ఎమోషన్ పీక్స్‌లో ఉంంటుంది. పతాక సన్నివేశాలు హృదయాన్ని బరువెక్కిస్తాయి. దర్శకుడు నమ్మింది, ఈ సినిమా తీసింది ఆ ఎమోషన్ కోసమే అయితే.. దర్శకుడు సక్సెస్ అయినట్టే.
కథకు కట్టుబడి సినిమా తీయాలన్నది బేసిక్ రూల్. ఆ రూల్ ని ధన్ రాజ్ పాటించాడు. కథ ఎటువైపు తీసుకెళ్తే సన్నివేశాల్ని అటు వైపు నడిపించాడు. లవ్ ట్రాకులూ, కామెడీ ట్రాకుల గోల లేకుండా చేశాడు. పాటలు కూడా మాంటేజ్‌లో కనిపించేవే. తండ్రి గురించి రాసిన పాట బాగుంది. మాటలూ అక్కడక్కడ మెరుస్తాయి. మేకింగ్ లో క్వాలిటీ ఉంది. దర్శకుడిగా ధన్ రాజ్‌కు తొలి ప్రయత్నం. ఆయనేదో తన ఇమేజ్‌కి తగ్గట్టుగా ఓ కామెడీ సినిమా తీయకుండా, ఎమోషన్‌కి పెద్ద పీట వేసే, తండ్రీ కొడుకుల కథ చెప్పడం అభినందించదగిన విషయం.
ధన్ రాజ్‌కు నటుడిగా స్కోప్ ఇచ్చిన పాత్ర ఇది. సీరియస్ టోన్‌లోనే ఆ పాత్ర సాగింది. తన సహజసిద్ధమైన కామెడీ ప్రదర్శించడానికి ఎక్కడా ప్రయత్నించలేదు. ఇలాంటి పాత్రలకు కూడా ధన్ రాజ్ ని ట్రై చేయొచ్చు అని చెప్పడానికి ఓ ఉదాహరణగా నిలుస్తుంది ఈ సినిమా. ఇక సముద్రఖని గురించి చెప్పేది ఏముంది? ఇలాంటి పాత్రలు ఆయనకు కొట్టిన పిండే. చాలా ఈజీగా చేసుకొంటూ వెళ్లిపోయారు. సునీల్ కనిపించేది కాసేపే. కానీ తన సీరియస్ నెస్ పే ఆఫ్ అయ్యింది. హరీష్ ఉత్తమన్ పాత్ర సర్ప్రైజ్ చేస్తుంది. తను ఇలాంటి పాజిటీవ్ పాత్ర చేయడం అరుదైన విషయమే. సత్య కాసేపు కనిపిస్తాడు.
ధన్ రాజ్ దర్శకత్వంలో ఓ సినిమా వచ్చిందంటే పెద్దగా అంచనాలు లేకుండానే సినిమాకు వెళ్తారు. అలా వెళ్లిన వాళ్లకు ఈ సినిమా కచ్చితంగా సర్ప్రైజ్ చేస్తుంది. బాక్సాఫీసు దగ్గర కలక్షన్ల పరిస్థితేంటి? డబ్బులెన్ని వస్తాయి? అనేది పక్కన పెడితే, ధన్ రాజ్ ఓ మంచి ప్రయత్నం చేశాడు, తాను నమ్మిన కథని నిజాయితీగా చెప్పాడన్న పేరైతే వస్తుంది.
తెలుగు360 రేటింగ్: 2.5/5