తిరుమల శ్రీవారి ప్రసాదం తయారీకి కల్తీ నెయ్యి వాడుతున్నారని తాను ఎంతో కాలం నుంచి చెబుతున్నా ఎవరూ పట్టించుకోలేదని శ్రీవారి ఆలయ గౌరవ ప్రధాన అర్చకులు రమణదీక్షితులు ప్రెస్మీట్ పెట్టి మరీ చెప్పారు. అయితే ఈ అంశంపై ఆయన గతంలో పింక్ డైమండ్ ఆరోపణలు చేసినట్లుగా ఎప్పుడూ బహిరంగ ఆరోపణలు చేయలేదు. కానీ.. తోటి అర్చకులకు చెప్పానని వారెవరూ వారి వారి వ్యక్తిగత కారణాలతో పట్టించుకోలేదని.. మిన్నకుండిపోయారన్నారు. అందుకే ఐదేళ్ల పాటు ఈ ఘోరం జరిగిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు.
ప్రస్తుతానికి రోజువారీ శ్రీవారి పూజా కైంకర్యాల్లో పాల్గొనేందుకు రమణదీక్షితులకు అుమతి లేదు. ఆయనకు గౌరవ ప్రధాన అర్చకుల హోదా మాత్రమే ఉంది. అందుకే ఆయన ఇలా ప్రెస్ మీట్లు, ట్వీట్లతో టైం పాస్ చేస్తున్నారు. మళ్లీ నందిని బ్రాండ్ నెయ్యితోనే లడ్డూరు తయారు చేయడం ఆనందంగా ఉందని ఆయన చెబుతున్నారు . నెయ్యి కి సంబంధించిన ల్యాబ్ రిపోర్టులు చూశానని మహాపాపం జరిగిపోయిందన్నారు. తిరుమలను ప్రక్షాళన చేస్తానని చంద్రబాబు చెప్పడం సంతోషమన్నారు.
ధర్మారెడ్డి క్రిస్టియన్ అని ఆయన టీటీడీని నాశనం చేస్తున్నారని గతంలో రమణదీక్షితుల పేరుతో ఓ వీడియో వైరల్ అయింది. దీనిపై ధర్మారెడ్డి ప్రోద్భలంతో టీటీడీ కేసులు పెట్టింది . ఓ దశలో రమణదీక్షితులను అరెస్టు చేస్తారన్న ప్రచారం జరిగింది. చివరికి ఆయన కోర్టు నుంచి రక్షణ పొందారు. ఆ వీడియో తాను మాట్లాడింది కాదని ఆయన అంటున్నారు. ఆయనపై టీటీడీ గతంలో పరువు నష్టం కేసులు కూడా దాఖలు చేసింది.