తిరుమల తిరపతి దేవస్థానం మాజీ ప్రధాన అర్చకులు రమణదీక్షితులు.. వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డితో సమావేశమయ్యారు. శుక్రవారం కోర్టుకు హాజరయ్యేందుకు… పాదయాత్రకు ముందుగానే విరామం ఇచ్చిన జగన్ .. గురువారం సాయంత్రం లోటస్ పాండ్ కు చేరుకున్నారు. ఆ తర్వాత రమణదీక్షితులు లోటస్ పాండ్ కు వచ్చారు. వీరిద్దరు ఏ విషయంపై చర్చించారన్న దానిపై వైసీపీ వర్గాలు నోరు మెదపడం లేదు. కానీ రమణదీక్షితులు మాత్రం… మిరాశీ వ్యవస్థను కాపాడటానికి జగన్ ను కలిశానని చెప్పుకొచ్చారు. జగన్ ను కలిస్తే తప్పేమిటని ఎదురు ప్రశ్నించారు. జగన్ న్యాయం చేస్తారన్న నమ్మకం ఉందన్నారు. తన పొట్ట ఎవరు నింపితే వారికే మద్దతిస్తానని బహిరంగంగానే ప్రకటించేశారు.
తిరుమల తిరుపతి దేవస్థానంలో అవకతవకలు జరుగుతున్నాయని… ఇరవై నాలుగేళ్ల పాటు ప్రధాన అర్చకులుగా పని చేసిన రమణదీక్షితులు కొద్ది రోజులుగా తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు. ఓ వజ్రం మాయమైందని.. తిరుమలలో తవ్వకాలు జరిగాయని కూడా ఆయన ఆరోపిస్తున్నారు. దీంతో… శ్రీవారి ఆలయ ప్రతిష్టను దిగజారుస్తున్నందుకు.. ఆయనపై న్యాయపరమైన చర్యలు తీసుకోవాలని… టీటీడీ నిర్ణయించింది. తన ఆరోపణలకు కట్టుబడి ఉన్నానని రమణదీక్షితులు జగన్ తో సమావేశం అనంతరం ప్రకటించారు.
కొద్ది రోజుల క్రితం కర్ణాటక ఎన్నికల ప్రచారం ముగించుకుని.. తిరుమలకు వచ్చిన అమిత్ షాతో రమణదీక్షితులు మంతనాలు జరిపారు. ఆ తర్వాతే ఆరోపణల పర్వం ప్రారంభించారు. ముందుగా చెన్నైలో.. ఆ తర్వాత ఢిల్లీలో ఈ తరహా ఆరోపణలు చేశారు. అప్పుడే టీటీడీ ఆయనకు రిటైర్మెంట్ ప్రకటించేసింది. ఆ తర్వాత కూడా రమణదీక్షితులు తన ఆరోపణల పర్వం కొనసాగిస్తున్నారు. బీజేపీ చేతిలో కీలుబొమ్మగా మారి రాజకీయం కోసం… శ్రీవారి ఆలయ ప్రతిష్టను దిగజారుస్తున్నారన్న ఆరోపణలు తెలుగుదేశం పార్టీ నేతలు చేస్తున్నారు. టీటీడీ నేపధ్యంగా రాజకీయ కుట్ర జరుగుతోందన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్న తరుణంలో ఇప్పుడు నేరుగా రమణ దీక్షితులు జగన్ తో భేటీ కావడం కలకలం రేపుతోంది. అంతా ప్లాన్ ప్రకారం చేస్తున్నారన్న ఆరోపణలకు బలం చేకూరినట్లవుతోందన్న అనుమానాలు ప్రారంభమయ్యాయి.
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వర్గాలు మాత్రం… సమావేశంలో ప్రత్యేకత లేదంటున్నారు. తన పోరాటానికి జగన్ మద్దతు కోరేందుకు వచ్చారని అంటున్నారు. రమణదీక్షితులు మొదటి నుంచి వైఎస్ కుటుంబానికి సన్నిహితుడు. 2003లో చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే.. వైఎస్ సీఎం కావాలని.. కొండపై యాగం చేశారు. నిబంధనలకు విరుద్ధమైనా పట్టించుకోలేదు.ఇప్పటికీ.. తిరుపతిలోని తన ఇంట్లో.. వెంకటేశ్వరుని చిత్రపటాల పక్కన వైఎస్ ఫోటో పెట్టుకుంటారన్న ప్రచారం ఉంది.