దేవుడు వరమిచ్చినా పూజారి కరుణించాల్సిందే..!. అంటే దేవుడు తర్వాత దేవుడంతటి వాడు పూజారి. అంటే.. శ్రీవారు భక్తులకు ఎంత పవిత్రుడో.. ఆయన ఆలయ ఆయన ప్రధాన అర్చకులు.. రమణదీక్షితులు అంత పవిత్రుడే. ఆయనలో దేవుడ్ని చూసుకునే భక్తులు ఎంతో మంది ఉంటారు. శ్రీవారి పూజలు, కైంకర్యాలను ఇరవై నాలుగేళ్ల పాటు దగ్గరుండి చూసుకున్న వ్యక్తిగా ఆయనకు పాద నమస్కారం చేసి ఆశీస్సులు పొందాలనుకునేవారు.. కోట్ల మంది ఉంటారు. అలాంటి వ్యక్తి ఇప్పుడేం చేస్తున్నారు..? రాజకీయ యాత్రలు చేస్తున్నారు. నేతల్లా ఆరోపణలు చేస్తూ విమర్శలకు గురవుతున్నారు.
అన్యమతస్తుడైన… వైసీపీ పార్టీ అధినేత జగన్ ఇంటికి వెళ్లారు. లోటస్ పాండ్‌లోని జగన్ ఇంటిపై అతి పెద్ద శిలువే కాదు.. ఇంట్లో ఓ పెద్ద చర్చి కూడా ఉంటుంది. వారింట్లో ఏ ఒక్క హిందూ దేవుని చిత్రపటం ఉండదు. అసలు శ్రీవారి ప్రసాదాన్ని ముట్టుకోవడమే మహాపాపం భావిస్తారు వాళ్లు. ఇలాంటి ఇంటికి వెళ్లి రమణదీక్షితులు విమర్శల పాలయ్యారు. దానికి తన కారణాలు ఏవో తాను చెప్పారు. జగన్ ఇంటికి వెళ్లడంతోనే తాను సరిపెట్టుకోనంటున్నారు రమణదీక్షితులు. త్వరలో బీజేపీ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడు కన్నా లక్ష్మినారాయణ. జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్‌లను కూడా కలుస్తానంటున్నారు. వారి ఆపాయింట్‌మెంట్లను కూడా అడిగారట..!
ఈ రాజకీయ యాత్రలన్నీ.. శ్రీవారి ఆలయ ప్రతిష్ఠను పెంచడానికట. ఆలయంలో జరుగుతున్న అపచారాలను నివారించడానికట. వీళ్లందరూ.. శ్రీవారి ఆలయ పవిత్రను ఎలా కాపాడుతారో రమణదీక్షితులకే తెలియాలి..? . నిజమో కాదో తెలియని.. ఆపరేషన్ గరుడ అనే అంశాన్ని తెలుగుదేశం పార్టీ విస్త్రతంగా ప్రజల్లోకి తీసుకెళ్తోంది. అందులో రమణదీక్షితులు ప్రధాన పాత్ర పోషిస్తున్నారంటున్నారు. శ్రీవారి భక్తుల్లో అలజడి రేపి.. భావోద్వేగాలను రెచ్చగొట్టేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపిస్తున్నారు. ప్రస్తుతం రమణదీక్షితులు చేస్తున్న ప్రకటనలు.. ఆయన కలుస్తామంటున్న వ్యక్తులను చూస్తే.. ప్రజలు నమ్మక తప్పనిసరి పరిస్థితులను వీరే కల్పిస్తున్నట్లుగా ఉంది.
శ్రీవారి ఆలయ ప్రతిష్టను దిగజార్చేలా ఆరోపణలు చేస్తున్న రమణదీక్షితులకు.. లీగల్ నోటీసులు ఇవ్వడానికి టీటీడీ అధికారులు ప్రయత్నిస్తున్నారు. కొద్ది రోజులుగా నోటీసులతో తిరుమల, తిరుపతి, చెన్నైల్లోని ఆయన ఇంటికి చక్కర్లు కొడుతున్నారు. కానీ రమణదీక్షితులు వారికి దొరకడం లేదు. ఇవాళ కాకపోతే.. రేపైనా ఆయనకు నోటీసులు ఇస్తారు. తను చేసిన ఆరోపణలకు.. ఆధారాలు చూపించలేకపోతే.. చిక్కుల్లో పడతారు. అందుకే.. ఆయన రాజకీయ నేతల చుట్టూ తిరుగుతున్నారన్న ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి.