పోరాటం అన్నది ప్రతి ఒక్కరి హక్కు. న్యాయమో, అన్యాయమో తమకు ఒక విషయం జరిగింది అనుకున్నపుడు గొంతెత్తడం అన్నది ప్రతి ఒక్కరి అవసరం. ఆ విధంగా తిరుపతి ప్రధాన అర్చకులు రమణ దీక్షితులు ప్రభుత్వం లేదా టీటీడీ నిర్ణయంపై గొంతెత్తడం అన్నది తప్పు కాదు. తనను అన్యాయంగా తొలగించారనో? తనను తొలగించడం అన్యాయం అనో ఆయన మాట్లాడడం ముమ్మాటికీ సబబుగా వుంటుంది. కానీ ఆయన ఆ దిశగా తన పోరు ప్రారంభించలేదు. తను కొలువున్న చోట, తాను నిత్య కైంకర్యాలు అర్పిస్తున్న చోట భయంకరమైన అన్యాయాలు, అపచారాలు చోటు చేసుకుంటున్నాయన్న పదునైన ఆరోపణలతో నిరసన ప్రారంభించారు. ఇదీ ఆయన వేసిన తొలి తప్పటడుగు.
ఇది తప్పెలా అవుతుంది? ఓ ఉద్యోగి తను పని చేస్తున్న చోట జరగరానివి జరుగుతుంటే, ముందుగా చేయాల్సిన పని యాజమాన్యం దృష్టికి సదరు అన్యాయాలను తీసుకురావాల్సి వుంటుంది. రమణ దీక్షితులు అనే పెద్దాయన తిరుపతిలో చాలా కీలకమైన వ్యక్తి. ఆయనకు లేని పరిచయాలు లేవు. ఆయన చెబుతున్న వైనాలు కూడా ఈనాటికి కావు. అందువల్ల ఇప్పటికే ఆయన లిఖితపూర్వకంగానో? మౌఖికంగానో టీటీడీకో, ముఖ్యమంత్రి దృష్టికో తాను ఏవయితే ప్రెస్ మీట్ లో చెప్పారో వాటిని తీసుకువచ్చి వుండాల్సింది. కానీ అలా జరగలేదు.
సరే, మీడియాలో చెప్పారు. ఆ తరువాత జరిగిన పర్యవసానాలు తెలిసిందే. అప్పుడు రమణ దీక్షితులు తీసుకోవాల్సిన తరువాత చర్య ఏమిటి? మళ్లీ మళ్లీ ప్రెస్ మీట్ లు పెట్టడం కాదు. న్యాయస్థానాన్ని ఆశ్రయించడం. ప్రతి ఒక్కరీ ఈ దేశంలో ఆ అవకాశం వుంది. రమణ దీక్షితులు లాంటి వారికి ఇంకా ఎక్కువ అవకాశం వుంది. ఆ విధంగా వెళుతున్నట్లు ఆయన ఢిల్లీలో కనిపించారు కూడా. కానీ ఆ తరువాత ఏమయిందన్నది తెలియదు. న్యాయవాదులతో డిస్కస్ చేసారనీ వార్తలు వచ్చాయి. కానీ కోర్టులో పిటిషన్ వేసారా? స్టే ప్రయత్నం చేసారా? అన్నవాటిపై మాత్రం క్లారిటీ లేదు.
ఇప్పుడు రమణ దీక్షితులు ప్రతిపక్ష నాయకుడు జగన్ ను కలిసారు. కలవడం ఎంత మాత్రం తప్పు కాదు. తన సమ్యను, తనకు అన్యాయం జరిగిందని భావిస్తే, ఆ విషయాన్ని విన్నవించుకోవడం కూడా తప్పు కాదు. కానీ దీనివల్ల రమణ దీక్షితులుకు ఒరగేది ఏమీ వుండదు. ఎందుకుంటే ప్రభుత్వంపై ఆయన పోరాటం చేస్తున్నారు. ప్రభుత్వంపై ఆరోపణలు చేస్తున్నారు. అలాంటపుడు ప్రతిపక్షం ఏ విధంగా సాయం చేయగలదు. ప్రతిపక్షం మాట ఈ విషయంలో ప్రభుత్వం ఎందుకు వింటుంది? జగన్ ను కలవడం అన్నది వృధా ప్రయాసగా మిగులుతుంది తప్ప ఫలితం ఇవ్వదు. కేవలం జగన్ అధికారంలోకి వస్తేనే ఫలితం ఇవ్వగలదు తప్ప, ఇప్పుడయితే కాదు.
కానీ రమణ దీక్షితులు సమస్యను సానుభూతితో పరిశీలించే నూట్రల్ జనాలకు ఇదంతా రాంగ్ మెసేజ్ ఇచ్చే ప్రమాదం మాత్రం వుంది. రమణ దీక్షితులు వ్యక్తిగత సమస్యపై పోరు చేస్తున్నారా? రాజకీయ పోరు దిశగా వెళ్తున్నారా? అన్న అనుమానాలు రేకెత్తిస్తుంది. కోర్టుకు వెళ్లి, న్యాయం కోరకుండా ‘అరౌండ్ ది బుష్’ అన్నట్లు ఈ ప్రెస్ మీట్ లు, రాజకీయ సమాలోచనలు ఎందుకోసం?
దీనంతటివల్లా ఏం జరుగుతుందీ అంటే వాదన, ప్రతివాదన అనేవి బలంగా పెరుగుతూ వస్తాయి. దీంతో రమణ దీక్షితులు వాయిస్ తగ్గిపోతోంది. ఆయన ఒకటి అంటే, ఇవతలి నుంచి రెండు వినిపిస్తుంటే, ఇక సింపతీ అన్నది రమ్మన్నా రాదు. అదే కనుక కోర్టు ద్వారా ఏ మాత్రం ఉపశమనం వచ్చినా పరిస్థితి వేరుగా వుంటుంది. మరి ఆ దిశగా రమణ దీక్షితులు ఎందుకు ప్రయత్నించడం లేదో?
మరోపక్క తన ఇంట్లో వైఎస్ కోసం హోమం చేసారన్న దానికి రమణ దీక్షితుల నుంచి ఇప్పటివరకు ఖండన లేదు. అలాంటి నేపథ్యంలో జగన్ ను ఓ చర్చి మాదిరిగా వుండే లోటస్ పాండ్ లోకి వెళ్లి కలవడం అన్నది హిందువుల మనో భావాలను కాస్తయినా ప్రభావితం చేసే అవకాశం వుంది. ఆ విధంగా మరి కొంత సానుభూతిని రమణ దీక్షితులు కోల్పొతున్నారు.
ఇంకోపక్క రమణ దీక్షితులు రేకెత్తించిన అనుమానాలు, ఆరోపణలను ఆధారం చేసుకుని, తిరుపతిని రాష్ట్రం నుంచి విముక్తి చేసి, కేంద్రం ఆధీనంలోకి తేవాలన్న ప్రయత్నాలు తమిళనాట నుంచి బాహాటంగానే ప్రారంభమయ్యాయి. ఇవి కాస్త వేగం పుంజుకుంటే, దానికి కూడా మూలం రమణ దీక్షితులే అన్న ముద్ర పడుతుంది. అప్పుడు ఆంధ్ర భక్త జనాల సానుభూతి రమణ దీక్షితులకు రమ్మన్నా రాదు.
ఇలా తప్పుటడుగులు వేస్తూ పోవడం అంటే, తన వైపు సరైన పాయింట్ లేకపోవడం తప్ప వేరు కాదు అనుకోవాలి. అలాంటపుడు రమణ దీక్షితులు చేయాల్సింది ఒక్కటే, చేతులు ముడుచుకుని, తన అనుకూల ప్రభుత్వం వచ్చేవరకు వేచి వుండడమే.
ఆర్ మార్తాండ శర్మ