ప్రధాన అర్చకునిగా ఉండి శ్రీవారి ఆలయ ప్రతిష్టను సైతం పణంగా పెట్టి రాజకీయం చేసిన రమణదీక్షితులు ఇప్పుడు అటూ ఇటూ కాకుండా పోయారు. అప్పటి ప్రభుత్వం ఆయనను సాగనంపితే.. తాము రాగానే మళ్లీ పదవి ఇస్తానన్న ప్రస్తుత పాలకు వచ్చి రెండున్నరేళ్లు గడిచినా .. ఉత్తుత్తి జీవోలతో ఆదేశాలతో ఆయనను మోసం చేస్తున్నారు కానీ ఇవ్వాల్సిన పదవి మాత్రం ఇవ్వలేదు.దీంతో రమణదీక్షితులు ఇప్పటికీ సోషల్ మీడియాలో ఆవేదన వ్యక్తం చేస్తూ టైం పాస్ చేస్తున్నారు. తాజాగా జగన్‌కు పెట్టిన ఓ ట్వీట్ వైరల్ అవుతోంది. కానీ ఆ ట్వీట్ చేసి ఆయనకు ఇంకా తత్వం బోధపడలేదా అని ఇతరులు నవ్వుకునే పరిస్థితి.
వైసీపీ అధికారంలోకి వస్తే ఆయనకు మళ్లీ ప్రధాన అర్చకుని పదవి ఇస్తామని రాజకీయం చేసి నష్టపోయినందున జగన్ హామీ ఇచ్చారు. జగన్ గెలిచారు కానీ ఆయన గురించి పట్టించుకోలేదు. అవసరం అయినప్పుడు మాత్రమే జగన్‌కు రమణదీక్షితులు గుర్తుకు వస్తున్నారు. ఓ సారి ఆగమ సలహాదారు, గౌరవ ప్రధాన అర్చకుని పదవి ఇచ్చారు. ఎందుకంటే ఎల్వీ సుబ్రహ్మణ్యాన్ని సీఎస్‌గా అత్యంత అవమానకరంగా తొలగించారు. ఆయన తొలగింపుపై చర్చ జరుగుతోంది. ఆ సమయంలో హిందువుల్లో వ్యతిరేకత రాకుండా ఆ పని చేశారు. అప్పటికి అలా రమణదీక్షితుల్ని జగన్ ఉపయోగించుకున్నారు. కానీ రమణదీక్షితులకు మాత్రం ఆ పదవి వల్ల ఎలాంటి ప్రయోజనం లేదు.. ఆలయంలోకి ప్రవేశం దక్కలేదు.
దీంతో మళ్లీ అసంతృప్తి ట్వీట్లు పెట్టడం ప్రారంభించారు. కానీ అలాంటివాటిని సందర్భం వచ్చే వరకూ జగన్ పట్టించుకోరు. అలాంటి సందర్భం మళ్లీ తిరుపతి ఉపఎన్నిక రూపంలో వచ్చింది. అప్పుడు మళ్లీ హిందువుల్ని ఆకట్టుకోవడానికి రమణదీక్షితుల్ని ప్రధాన అర్చకులుగా నియమిస్తూ ఉత్తర్వులు ఇచ్చారు. ఎన్నికలయిపోయాయి. కానీ ఆయనకు విధులు నిర్వహించే అవకాశం కల్పించలేదు. దీనికి కోర్టు ఉత్తర్వులను కారణంగా చూపిస్తున్నారు. ఇప్పుడు మళ్లీ రమణదీక్షితులు ట్వీట్లు పెడుతున్నారు. మరోసారి హిందువుల్ని బుజ్జగించే పరిస్థితి వచ్చినప్పుడు రమణదీక్షితుల గురించి జగన్ ఆలోచించే అవకాశం ఉందని ప్రత్యేకగా చెప్పాల్సిన పని లేదు.