ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకి రమణదీక్షితులుఓ విన్నపం చేశారు. సోషల్ మీడియాలో ఈ విన్నపం చేసుకున్నారు. గత ప్రభుత్వం పెట్టిన అక్రమ కేసులన్నింటినీ లిస్టవుట్ చేసుకుని తీసేయాలని నిర్ణయం తీసుకున్నారు కాబట్టి.. ఆ జాబితాలో తన కేసుని కూడా చేర్చాలని ఆయన ఆ విన్నపంలో పెట్టారు. ఇద్దరు ప్రధాన అర్చకులు కేసుల్లో ఉన్నవారికి విముక్తి కలిగించాలని కోరారు. అందులో ఆయన ఒకరు.
ఇటీవల ధర్మారెడ్డితో పాటు టీటీడీ విషయంలో ఆయన మాట్లాడిన ఓ వీడియో వైరల్ అయింది. దానిపై టీటీడీ కేసు పెట్టింది. ఆ కేసులో అరెస్టు కూడా చేయాలని జగన్ సర్కార్ ప్రయత్నించింది. ఎలాగో కోర్టు సాయంతో బయటపడ్డారు. ఇప్పుడు ప్రభుత్వం మారడంతో ఆ కేసు నుంచి విముక్తి కావాలని ఆయన కోరుతున్నారు. టీడీపీ కార్యకర్తలపై పెట్టిన తప్పుడు కేసుల గురించి చంద్రబాబు పార్టీ నేతలతో చెప్పారు. మరి తనను కూడా పార్టీ క్యాడర్ ఖాతాలో చేర్చుకోమంటున్నారేమో కానీ…. అదే తరహాలో విజ్ఞప్తి చేశారు.
అసలు చంద్రబాబు 2019లో ఓటమికి కారణమైన వారిలో ఈ రమణదీక్షితులు ఒకరు. దేవుడ్ని కూడా రాజకీయాలకు వాడేసి చంద్రబాబుపై బురద చల్లేశారు. పింక్ డైమాండ్ అని ఈయన కథ అల్లితే విజయసాయిరెడ్డి సినిమా చూపించారు. ఊరూవాడా ప్రెస్మీట్లు పెట్టి చంద్రబాబుపై బురద చల్లారు. పోటు తవ్వకాలన్నారు. బంగారం మాయమన్నారు. అప్పటికి ఆయన ప్రధానార్చకుడిగానే ఉన్నారు. ఆయన తీరు చూసి ప్రభుత్వం రిటైర్మెంట్ ప్రకటించేసింది.
జగన్ ట్రాప్ లో పడి చివరికి బోరగడ్డ అనిల్ అనే మత మార్పిళ్లు చేసుకునే వ్యక్తితో కలిసి ప్రెస్ మీట్లు పెట్టే పరిస్థితికి వచ్చారు. అప్పుడు టీటీడీ ఆయనపై పరువు నష్టం కేసులు పెట్టింది. తర్వాత జగన్ ప్రభుత్వం ఆయనకు మళ్లీ ప్రధాన అర్చకహోదా ఇచ్చినట్లుగా నటించింది కానీ కేసులు బహుమతి ఇచ్చింది. ఇప్పుడు మళ్లీ తనపై కేసులు ఎత్తివేయాలని తాను కుట్రలు చేసిన చంద్రబాబునే వేడుకుంటున్నారు.