దేవదేవుని ప్రధాన అర్చకులుగా… స్వామి వారి సన్నిధిలో ఏళ్లకు ఏళ్లు గడిపిన… రమణ దీక్షితులు ఇప్పుడు ఆ స్వామివారినే రాజకీయంగా ఉపయోగించుకుని వివాదం చేద్దామని చూడటం సంచలనాత్మకమవుతోంది. భారతీయ జనతాపార్టీ అధ్యక్షుడు అమిత్ షా తిరుమలలో పర్యటించినప్పుడు ఆయనతో ఏకాంతంగా సమావేశమైన ప్రధానార్చకులు.. ఆ తర్వాత హఠాత్తుగా చెన్నైలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. టీటీడీ అధికారులు, ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు.
టీటీడీలోని అధికారులు కొంతమంది అధికార బలంతో ఆలయ నిబంధనలను విస్మరిస్తున్నారని, సినీ, రాజకీయ ప్రముఖులకు భజన చేస్తూ ఆలయ సంప్రదాయాలను, కైంకర్యాలను దెబ్బతీస్తున్నారని విమర్శించారు. రమణ దీక్షితులు చేసిన విమర్శలు, ఆరోపణలు టీటీడీ అధికారులు, వేదపండిత, ఉద్యోగ వర్గాల్లో కలకలం రేపాయి. నిజానికి రమణదీక్షితులు పైన చేసిన ఆరోపణలన్నీ… ఆయనపై వచ్చినవే. వీఐపీల కోసం కొండపై ప్రత్యేకంగా యాగాలు చేయడం దగ్గర్నుంచి… గర్భగుడిలోకి మనవడిని తీసుకెళ్లడం వరకు.. ఆయన ఎన్నో అపచారాలకు పాల్పడ్డారని తోటి అర్చకులే ఆరోపిస్తూంటారు. దీనిపై అనేక సార్లు వివాదాలు కూడా ఏర్పడ్డాయి. కానీ టీటీడీ ప్రధాన అర్చకులు అన్న గౌరవంతో చూసీ చూడనట్లు ఉంటూ వచ్చింది. ఇప్పుడు నేరుగా తిరుమల పవిత్రతనే దెబ్బతీసే ప్రయత్నం చేయడంతో.. వ్యూహాత్మకంగా 65 ఏళ్లు పైబడిన అర్చకులకు రిటైర్మెంట్ ఇచ్చేసింది. దీంతో దీక్షితులు పదవి కోల్పోయారు.
కొద్ది రోజుల నుంచి తిరుమల తిరుపతి దేవస్థానాన్ని కేంద్రం తమ అధీనంలోకి తీసుకునే ప్రయత్నాలు చేస్తోందన్న అమానాలున్నాయి. పురావస్తు శాఖను రంగంలోకి దింపి..అభాసుపాలయింది. ఇప్పుడు అమిత్ షా ప్రొద్బలంతో… దీక్షితులు.. కొత్త ఆరోపణలు చేస్తున్నారన్న అనుమానాలున్నాయి. ఎప్పుడో వంశపారంపర్య అర్చకత్వం మిరాశీ వ్యవస్థను రద్దు చేశారు. ఇప్పుడు మళ్లీ ఆ వ్యవస్థ కోసం రమణదీక్షితులు ప్రయత్నిస్తున్నారు. బలవంతంగా టీటీడీ రిటైర్మెంట్ ఇవ్వడంతో కోర్టుకు వెళ్తానంటున్నారు.
మొత్తానికి తిరుమల తిరుపతి దేవస్థానాల నిర్వహణ తప్ప… లోపల పూజలు, కైంకర్యాలు అనీ క్రమ పద్దతిగా జరుగుతాయి. దీనికి ప్రత్యేక వ్యవస్థ ఉంది. అన్నీ ఆగమశాస్త్రాల ప్రకారం… జరిగిపోతూంటాయి. ఈ వ్యవస్థలో రమణదీక్షితులు కూడా భాగమే. ఇంత కాలం లేని లోపాలు.. ఇప్పుడే రమణదీక్షితులకు కనిపించినట్లు.. దానిని ప్రభుత్వానికి ముడిపెట్టి ఆరోపణలు చేస్తూండటంతో.. స్వామి వారిని రమణదీక్షితులు రాజకీయాలకు ఉపయోగించుకుంటున్నారన్న అనుమానాలు భక్తుల్లో కనిపిస్తున్నాయి.