తిరుమల తిరుపతి దేవస్థానంలోకి మళ్లీ అడుగు పెట్టాలనుకున్న రమణదీక్షితుల కోరికను.. జగన్మోహన్ రెడ్డి ఐదు నెలల తర్వాత తీర్చారు. ఆయనను.. ఏ పదవిలోకి తీసుకోవడం సాధ్యం కాదని.. టీటీడీ బోర్డు చాలా కాలంగా చెబుతూ వస్తోంది. ఆయన చేసిన వివాదాలు.. వేసిన కేసుల కారణంగా… సమస్యలు ఉంటాయని చెప్పుకొచ్చింది. అయితే.. జగన్మోహన్ రెడ్డి ఎన్నికలకు ముందు.. ఆయనను మళ్లీ ప్రధాన అర్చకుని పదవిలో నియమిస్తామని హామీ ఇచ్చారు. జగన్ గెలిచిన తర్వాత పలుమార్లు రమణదీక్షితులు.. ఆయనను కలిసి తనకు ఇచ్చిన హామీ గురించి ప్రస్తావించారు. కానీ సాంకేతికంగా మళ్లీ… ప్రధాన అర్చకుని హోదాలో తీసుకోవడం సాధ్యం కాదని.. చెప్పి.. ఆగమ సలహాదారు పదవి తీసుకోవాలని సూచించారు. దానికి రమణదీక్షితులు ఓకే అన్నారు.
రమణదీక్షితులు ఆగమసలహాదారు హోదాలో.. ఆలయ ప్రవేశం చేయబోతున్నారు. నిజానికి ఆగమ సలహాదారు అంటే.. సలహాలకు మాత్రమే పరిమితం కావాలి.. కానీ.. తనకు ప్రభుత్వ పెద్దల వద్ద ఉన్న పలుకుబడి కారణంగా… శ్రీవారి ఆలయంపై ఆయన పూర్తి స్థాయి పట్టు సాధించేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకున్నారు. ఇప్పటికే… తన కుమారులు ఇద్దర్ని.. తిరుమల ఆలయానికి బదిలీ చేయించుకున్నారు. ఆయన కుమారులు.. వెంకటకుమార దీక్షితులు, రాజేష్ దీక్షితులు వంశపారంపర్య అర్చకత్వం ప్లస్ పాయింట్‌తో.. టీటీడీలో చేరారు. అయితే.. వారు విధులకు హాజరు కావడం లేదు. దీంతో.. వారిని గోవిందరాజులస్వామి గుడికి బదిలీ చేశారు. అక్కడా విధులకు హాజరు కావడం లేదు. అయినప్పటికీ.. రమణదీక్షితులు తను ఆగమ సలహాదారు పదవితో పాటు..కుమారుల్ని కూడా తిరుమలకు బదిలీ చేయించుకున్నారు.
పద్దెనిమిది నెలల తర్వాత శ్రీవారి ఆలయంలోకి.. ఇద్దరు కుమారులతో సహా అడుగుపెడుతున్న రమణదీక్షితులు.. .మొత్తం వ్యవస్థను గుప్పిట్లో పెట్టుకునేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకున్నారు. ఇప్పటికే ఆయన బద్ద విరోధిగా భావించే డాలర్ శేషాద్రి… మరో సారి పొడిగింపు తెచ్చుకున్నారు. రిటైరైన ఉద్యోగులందర్నీ తీసేసినా.. డాలర్ శేషాద్రిని మాత్రం తొలగించలేకపోయారు. ఆలయంలో.. మళ్లీ రెండు వర్గాల పోరాటం ప్రారంభమవుతుందన్న ఆందోళన.. టీటీడీ ఉద్యోగుల్లో కనిపిస్తోంది.