దాదాపు 150 చిత్రాల నిర్మాతగా ఎవరికీ సాధ్యం కాని మైలు రాయిని అందుకొన్నారు రామానాయుడు. అందుకే ఆయన మూవీ మొఘల్ అయ్యారు. ఆయన ఈ ప్రపంచాన్నీ, ఆయన జ్ఞాపకాల్నీ వదిలి రెండేళ్లయ్యింది. రేపు రామానాయుడు జయంతి. ఈ సందర్భంగా ఆయన స్మృతి చిహ్నంగా కొన్ని కార్యక్రమాలు చేయాలని ఆయన కుటుంబ సభ్యులు భావిస్తున్నారు. అందులో భాగంగా రామానాయుడు పేరుతో విశాఖలో ఏ మ్యూజియం ఏర్పాటు చేయనున్నారు. ఇందులో రామానాయుడు సినిమాలకు సంబంధించిన అపురూపమైన వస్తువుల్ని భద్రపరుస్తారు. రామానాయుడు నిర్మించిన 150 వ చిత్రాల్లోని కాస్ట్యూమ్స్, సెట్ ప్రాపర్టీ, గెటప్పులు, స్టిల్స్, అప్పట్లో వాడిన కెమెరాలు ఇవన్నీ అక్కడ ప్రదర్శనకు ఉంచుతారు. మెదక్ జిల్లాలోని నర్సాపూర్‌లో ఓ రైతు శిక్షణా శిబిరాన్ని ఏర్పాటు చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. ఇందుకు సంబంధించిన భూమిని రామానాయుడు కుటుంబం దానంగా ఇవ్వనుంది. మొత్తానికి రామానాయుడు జ్ఞాపకాల్ని దాచుకోవాలని, భావి తరానికి చూపించాలని ఆయన కుటుంబ సభ్యులు నిర్ణయించుకొన్నారు. ఇది మంచి పరిణామమే. మూవీ మొఘల్‌కి ఘనమైన నివాళే.