ఈమధ్య నిర్మాతల అందరి కంప్లైంట్… ”జనాలు థియేటర్లకు రావడం లేదు” అనే. చిన్నా, పెద్దా తేడా లేదు. ఏ సినిమాకైనా ఇదే పరిస్థితి. థియేటర్లకు రావాలనే ఆసక్తి పూర్తిగా ప్రేక్షకుల్లో సన్నగిల్లుతోంది. అయితే.. మాస్ సినిమాకి ఉన్న పవర్ వేరు. ఇప్పటికీ.. కాస్తో కూస్తో కలక్షన్లు బీ,సీ సెంటర్ల నుంచే వస్తున్నాయి. మాస్ సినిమాకి బీ,సీలే కీలకం. సో.. ఓ మంచి మాస్ సినిమా పడితే, జనాల పల్స్ కరెక్ట్‌గా తెలుస్తుందని ట్రేడ్ వర్గాలు ఆశ పడుతున్నాయి. ఈ దశలో..’రామారావు ఆన్ డ్యూటీ’ వస్తోంది. రవితేజ అంటేనే మాస్. మాస్ అంటేనే రవితేజ. కొన్ని సినిమాలుగా తన ట్రాక్ రికార్డ్ తప్పి ఉండొచ్చు గాక.. కాకపోతే… తనదైన రోజున థియేటర్లను తప్పకుండా థియేటర్లకు రప్పించగలిగే సామర్థ్యం రవితేజకు ఉంది.
పైగా రామారావుని పూర్తి మాస్ సినిమాగా ప్రమోట్ చేస్తున్నారు. ట్రైలర్లో యాక్షన్ డోస్ ఎక్కువగానే ఉంది. ఈరోజు ‘మాస్ నోటీస్’ అంటూ మరో చిన్న టీజర్ వదిలారు. ఇది కూడా పేరుకు తగ్గట్టుగానే మాసీగానే ఉంది. ఇవన్నీ మాస్‌ని థియేటర్లకు రప్పించే ప్రయత్నాలే. ఈ సినిమాకి కాస్త ఓపెనింగ్స్ దక్కితే…. బీసీల్లో సినిమా చూడ్డానికి మాస్ ప్రేక్షకులు ఇంకా సిద్ధంగానే ఉన్నారన్న సంకేతాలు అందుతాయి. రాబోయే ‘బింబిసార’, ‘మాచర్ల నియోజన వర్గం’ లాంటి సినిమాలకు అది ప్లస్ పాయింట్ అవుతుంది. అందుకే అందరి చూపూ… `రామారావు`పై పడింది.