Ramarao On Duty movie telugu review
రేటింగ్: 2/5
”రామారావు ఆన్ డ్యూటీ’ లాంటి సినిమాని ఇదివరకెప్పుడూ చేయలేదు, ఇది నాకు డిఫరెంట్ సినిమా” అని చెప్పాడు రవితేజ. ”రామారావు ఆన్ డ్యూటీ’ యూనిక్
థ్రిల్లర్’ అన్నాడు దర్శకుడు శరత్ మండవ. వారిద్దరు చెప్పినట్లే సినిమా ట్రైలర్ చాలా డిఫరెంట్ గా కంటెంట్ ప్రధానమైన సినిమా అనే నమ్మకం కలిగించడంలో సక్సెస్ అయ్యింది. కరోనా కష్టకాలంలో ‘క్రాక్’ లాంటి కమర్షియల్ హిట్ తో థియేటర్లో మళ్ళీ సందడి తెచ్చిన రవితేజ.. ”రామారావు ఆన్ డ్యూటీ’తో మరో హిట్ కొడతాడని ఫ్యాన్స్ లో బలమైన నమ్మకం. అందుకే రామారావు చుట్టూ చాలా పాజిటివ్ బజ్ క్రియేట్ అయ్యింది. ఇన్ని పాజిటివ్ వైబ్స్ మధ్య వచ్చిన రామారావు తన డ్యూటీని బాధ్యతగా చేశాడా ? ఇంతకీ ఏమిటీ రామారావు డ్యూటీ ?
రామారావు (రవితేజ) నిజాయితీ గల డిప్యూటీ కలెక్టర్. రెండు చేతులా డ్యూటీ చేస్తుంటాడు. బదీలీపై సొంత ఊరు చిత్తూరు వస్తాడు. అక్కడ కూడా తన విధిని
నిర్వహించడమే కాకుండా ఆఫీస్ లో అధికారులకు బాధ్యతలని నేర్పిస్తాడు. కట్ చేస్తే.. రామారావు ఆఫీస్ కి మాళిని (రజిషా విజయన్) అనే గృహిణి ఫిర్యాదులు ఉత్తరాల రూపంలో రాస్తుంటుంది. మాళిని భర్త సురేంద్ర ఏడాదిగా కనిపించకుండాపోయాడు. పోలీసులు పట్టించుకోరు. వెదికి వెదికి విసిగిపోయిన మాళిని ఇక ఆర్ధిక అవసరాల రిత్యా ఆస్తిని తన పేరున ట్రాన్స్ ఫార్మ్ చేయమనికోరుతుంది. ఈ ఫిర్యాదుని టేకాఫ్ చేసిన రామారావు మాళినిని కలుస్తాడు. మాళిని, రామారావు ఇద్దరు కలసి సిఐ మురళి (వేణు) కి ఫిర్యాదు చేస్తారు. సిఐ మురళి దాన్ని సరిగ్గా పట్టించుకోడు. దీంతో రామారావు రంగంలో దిగుతాడు. ఈ కేసుని పరిశోధించే క్రమంలో
తప్పిపోయింది మాళిని భర్త మాత్రమే కాదు, దాదాపు 22 మందని తెలుస్తుంది. ఇంతకీ వీరంతా ఎలా తప్పిపోయారు? దీని వెనుక ఎవరి కుట్ర వుంది? చివరికి
రామారావు ఈ మిస్టరీని ఎలా చేధించాడు ? అనేది మిగతా కథ.
రవితేజ చెప్పినట్లు ఇది అతనికి డిఫరెంట్ సినిమానే. ఇన్వెస్ట్ గేటివ్ థ్రిల్లర్. చాలా పాపులర్ జోనర్ ఇది. అయితే మాస్ హీరోలు ఈ జోనర్ లో సినిమాలు చేయడానికి పెద్ద ఆసక్తి చూపరు. ఎందుకంటే ఈ జోనర్ కి పాటలు, ఫైట్లతో పెద్ద అవసరం పడదు. ఐటెం సాంగ్స్ అక్కర్లేదు. గాల్లో సుమోలు లేపాల్సిన పని లేదు. నేర పరిశోధనని ఆసక్తికరంగా నడిపితే చాలు. అదే ఈ జోనర్ సక్సెస్ మంత్ర. కానీ దర్శకుడు శరత్ మండవ ఏకంగా మాస్ మహారాజాతోనే ఇలాంటి కథని చెప్పాలనుకున్నాడు. ఇక్కడి వరకూ బావుంది. అయితే ఈ కథలో రవితేజని ఇమిడ్చే క్రమంలో అసలు కథ అన్యాయమైపోయింది.
మంచి ఇన్వెస్ట్ గేటివ్ థ్రిల్లర్ కి ఉండాల్సిన లక్షణం.. ఫస్ట్ సీన్ నుంచే అసలు పాయింట్ చుట్టూ సన్నివేశాలు నడపడం. కానీ ఇందులో అది జరగలేదు. 80 దశకంలోని సినిమాలా.. హీరో వీరుడు సూరుడని చూపించడానికి దాదాపు ముఫ్ఫై నిమిషాల రన్ టైమ్ తినేశారు. ఇక్కడే ఇన్వెస్ట్ గేటివ్ థ్రిల్లర్ సైడ్ ట్రాక్పట్టేసింది. తనికెళ్ళ భరణితో హీరో గొప్పోడని చెప్పించిన దర్శకుడు, మళ్ళీ చిత్తూరులో కూడా అధికారులతో రామారావు చాలా గ్రేట్ అని చెప్పించడం దర్శకుడి అవుట్ డేటడ్ ఆలోచనలు అద్దం పట్టింది. నిజానికి ఒక మాస్ హీరోతో సినిమా ఎందుకు చేయాలి ?! ఆల్రెడీ అతనికి ఒక ఇమేజ్ వుంటుంది. ఒక్క సీన్ తో ఒక మాస్ హీరో క్యారెక్టర్ చెప్పొచ్చు. ఆ హీరోకి ఇమేజ్ వుంటుంది కాబట్టి ప్రేక్షకులు దాన్ని చాలా సులువుగా అర్ధం చేసుకుంటారు. ఈ విషయంలో దర్శకుడి ఆలోచనలు బీసీ కాలంలో వుండిపోయాడనిపిస్తుంది.
విరామం వరకూ అసలు కథలోకి వెళ్ళలేదు. కథలోకి వెళ్ళిన విధానం కూడా ఆసక్తికరంగా వుండదు. ఎర్రచందనం స్మగ్లింగ్ చుట్టూ ఒక మిస్టరీ రాసుకున్న దర్శకుడు. తప్పిపోయిన మనుషులు ఎక్కడికి వున్నారనే కొంత క్యూరీయాసిటీ క్రియేట్ చేయగలిగారు. అయితే రామారావు ఆ కేసుని చేధించే క్రమంలో చేసిన విచారణ మాత్రం ఆసక్తికరంగా వుండదు. 85నేపధ్యంలో జరిగే కథ ఇది. అయితే ఇందులో వచ్చే ట్విస్ట్ లు టర్న్ లు కూడా ఆనాటివే. విచారణ వేగం వుండదు. ఫైట్లు కథలో ఇమిడలేదు. ప్రతి పదినిమిషాలకు ఏదో గ్యాంగ్ రామారావు పై ఎటాక్ చేయడం, రామారావు వాళ్ళని చిత్తకొట్టడం.. ఇదే యాక్షన్ తంతు.
మిస్సింగ్ కేసుని పోలీసులు విచారించాలి. రెవెన్యు అధికారైన రామారావు ఈ కేసులోకి వస్తాడు. ఇలా ఈ కేసులో రామారావు ని తీసుకురావడానికి దర్శకుడు
రాసుకున్న ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ పరమ బోరింగా వుంది. నిజానికి మాళిని పాత్రకు ఆ గతం ఉండాల్సిన అవసరం లేదు. ఆ గతంతో ఈ కథకి వచ్చిన ఇంపాక్ట్ ఏమీ
లేదు. ఇందులో చాలా పాత్రలు కనిపిస్తాయి. కానీ రవితేజ పాత్ర తప్ప మరే పాత్రని బలంగా తీర్చిదిద్దలేదు. దీంతో తెరపై కనిపించే పాత్రలతో ప్రేక్షకుడికి కనెక్షన్ వుండదు. కొన్ని పాత్రలకు సరైన ముగింపే వుండదు. ఫ్యామిలీ, ఫ్లాష్ బ్యాక్, ఫాదర్ సెంటిమెంట్, పాటలు ఇలా అన్నీ ఎలిమెంట్స్ పెట్టి ఇన్వెస్ట్ గేటివ్ థ్రిల్లర్ కిచిడిలా మార్చేశాడు దర్శకుడు. ఇన్వెస్ట్ గేటివ్ థ్రిల్లర్ లో క్లైమాక్స్ చాలా ముఖ్యం. ఇందులో క్లైమాక్స్ .. ముందే తేలిపోయింది.
రవితేజ వన్ మ్యాన్ షో. రామారావు పాత్రని తన స్టయిల్ లోనే చాలా సులువుగా చేసుకుంటూ వెళ్ళాడు. ఫిట్ గా కనిపించాడు. పక్కా కమర్షియల్ సినిమాలానే
పాటలు, ఫైట్స్ , ఐటెం సాంగ్స్ అన్నీ పెట్టిన దర్శకుడు రవితేజకి వుండే మాస్ ఎనర్జీ ఇవ్వలేదు. బహుశా గవర్నమెంట్ అధికారి అంటే సీరియస్ ఫేస్ తో
ఉండాలనే రూల్ ఏమో. రజిషా పాత్ర కథలో బాగమైయింది. దివ్యంశ ఫ్యామిలీ లుక్‌లో కొత్తగా కనిపించింది. వేణు పాత్ర అతని కొత్తగా వుంది. సొంత డబ్బింగ్
చెప్పారు వేణు. అది ఇంకా ప్రేక్షకులకు అలవాటు అవ్వాలి. రాహుల్రామక్రిష్ణ, నాజర్, పవిత్ర లొకేష్, జాన్ విజయ్, తనికెళ్ళ భరణి పాత్రలు పరిధి మేరకు వున్నాయి. హీరో పాత్ర ఎంట్రి ఇచ్చినప్పుడు రాని అప్లాజ్.. స్క్రీన్ పై నరేష్, పవిత్ర లోకేష్ కనిపించినప్పుడల్లా వచ్చింది. బహుశా.. ఈమధ్య జరిగిన కరెంట్ `ఎఫైర్స్` వాళ్లలో ఉత్సాహం తీసుకొచ్చి ఉండొచ్చు.
సిఎస్ అందించిన నేపధ్య సంగీతానికి మంచి మార్కులు పడతాయి. సీసా పాట మాస్‌ని అలరిస్తుంది. సత్య సూర్యాన్ సినిమాటోగ్రఫీ డీసెంట్ గా వుంది. ఎడిటింగ్
పరంగా ఫస్ట్ హాఫ్ లో కొన్ని సీన్స్ ని ఇంకా ట్రిమ్ చేయొచ్చు. నిర్మాణ విలువలు ఉన్నతంగా వున్నాయి. ఒక మాస్ హీరోతో ఇన్వెస్ట్ గేటివ్ థ్రిల్లర్ చేయాలనే దర్శకుడు ఆలోచన కొత్తగా వున్నా దాన్ని తెరపైకి తెచ్చిన విధానం మాత్రం చాలా పాతగా వుంది.
రవితేజ హిట్టూ ఫ్లాపుతో సంబంధం లేకుండా సినిమాలు చేసుకుంటూ పోతున్నాడు. వరుస ఫ్లాపులు పడుతున్నా.. తనకు అవకాశాలు వస్తూనే ఉన్నాయి. అయితే… ఇదే ఓవర్ కాన్ఫిడెన్స్ తో చేసిన తప్పే మళ్లీ చేసుకొంటూ పోతే – రవితేజ లాంటి మాస్, కమర్షియల్ హీరో.. ఇంకా అధఃపాతాళలోకి కూరుకుపోతాడు. ఈ విషయాన్ని ఈ హీరో ఎంత త్వరగా గ్రహిస్తే అంత మంచిది.
రేటింగ్: 2/5