టాలీవుడ్లో మరో భారీ ప్రాజెక్టుకు అతి త్వరలో శ్రీకారం చుట్టబోతోంది. భారతీయ సినీ చరిత్రలో ఇప్పటి వరకూ ఏ చిత్రానికీ పెట్టనంత పెట్టుబడితో ఏకంగా రూ.500 కోట్లతో ఓ చిత్రం రూపొందనుంది. అదీ మన తెలుగులో. రామాయణ గాథని వెండి తెరపై ఆవిష్కరించడానికి ఓ భారీ కసరత్తు మొదలైంది. ఈ ప్రాజెక్టులో అల్లు అరవింద్, మధు మంతెన, నమిత్ మల్హోత్రా భాగస్వాములు కాబోతున్నారు. ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా వచ్చేసింది. అయితే నటీనటులు ఎవరు? సాంకేతిక నిపుణులెవరు? అనే విషయాలపై క్లారిటీ రావాల్సివుంది. “ఈ ప్రాజెక్టు ఓ గురు తర బాధ్యత. అనితర సాధ్యమైన ఓ చిత్రాన్ని భారతీయ సినీ ప్రేక్షకులకు అందివ్వబోతున్నాం. ప్రస్తుతం నటీనటులు, సాంకేతిక నిపుణులకు సంబంధించిన కసరత్తులు జరుగుతున్నాయి. త్వరలోనే మిగిలిన వివరాలు చెబుతాం“ అని ప్రకటించారు అల్లు అరవింద్. మెగా ఫ్యామిలీలో బోల్డంత మంది హీరోలున్నారు. రామ్‌చరణ్, అల్లు అర్జున్‌లు స్టార్ డమ్ సంపాదించుకొన్నారు. పైగా కత్తి యుద్దాల్లో ప్రావీణ్యం దక్కించుకొన్నవాళ్లే. మరి వీళ్లలో ఎవరికి ఈ రామాయణంలో ఛాన్స్ వస్తుందో చూడాలి. అంతర్జాతీయ ప్రాజెక్టు కాబట్టి మిగిలిన అన్ని భారతీయ భాషల్లోకీ ఈ సినిమాని విడుదల చేస్తారు. తమిళం, మలయాళం, హిందీ చిత్ర సీమలనుంచి కూడా నటీనటుల్ని, సాంకేతిక నిపుణుల్నీ ఎంపిక చేసుకోవడం తథ్యం. మరి.. ఆ జాబితాలో ఎవరెవరు ఉంటారో??