రామ్ చరణ్ – బుచ్చిబాబు ఈ కాంబోలో ఓ సినిమా రూపుదిద్దుకొంటున్న సంగతి తెలిసిందే. త్వరలోనే ఈ చిత్రాన్ని పట్టాలెక్కిస్తారు. ఈ సినిమాకు సంబంధించిన ఓ ఆసక్తికరమైన విషయం ఇప్పుడు వెలుగులోకి వచ్చింది. ఈ కథ కోసం కోడి రామ్మూర్తి నాయుడు అనే ఓ మల్ల యోధుడి జీవితాన్ని స్ఫూర్తిగా తీసుకొన్నారని తెలుస్తోంది.
కోడిరామ్మూర్తి నాయుడు గురించి ఆంధ్రా ప్రజలు కథలు కథలుగా చెప్పుకొంటారు. శ్రీకాకుళం జిల్లా వీరఘట్టంలో 1882లో పుట్టిన రామ్మూర్తి నాయుడు అత్యంత శక్తిమంతుడు. కుస్తీ పోటీల్లో తనకు తిరుగు లేదు. తను చేసే విన్యాసాలు అప్పట్లోనే ఒళ్లు గగర్పాటుకు గురి చేసేవి. వేగంగా దూసుకుపోతున్న రెండు కార్లని ఒకేసారి.. తన రెండు చేతులతో ఆపేంత శక్తి కోడి రామ్మూర్తి నాయుడుకు ఉండేది. ఆయన తన ఛాతీపై నాపరాళ్లని పరుచుకొని పడుకొంటే… ఆ రాళ్లపైనుంచి ఏనుగు నడుచుకొంటూ వెళ్లిపోయేది. ఒంటిచేత్తో రైలు ఇంజన్ని ఆపిన చరిత్ర కూడా రామ్మూర్తి నాయుడుడ సొంతం. ఆయన బుల్ ఫైట్ లోనూ పాల్గొన్నారని చరిత్ర చెబుతోంది. రామ్మూర్తి నాయుడు ఓ సర్కస్ కంపెనీ కూడా నిర్వహించారు. కలియుగ భీమ, మల్ల మార్తాండ, వీర కంఠీవ లాంటి బిరుదుల్ని సొంతం చేసుకొన్నాడు.
ఇప్పుడు ఈయన జీవితాన్ని స్ఫూర్తిగా తీసుకొని బుచ్చిబాబు రామ్ చరణ్ పాత్రని తీర్చిదిద్దారని తెలుస్తోంది. బుచ్చిబాబు చిత్రంలో చరణ్ మల్లయోధుడిగా కనిపించనున్నాడు. ఇది కూడా పిరియాడికల్ డ్రామానే. అయితే పూర్తిగా రామ్మూర్తి నాయుడు జీవితాన్ని తెరకెక్కిస్తున్నారా? లేదంటే.. హీరో పాత్ర కోసం మాత్రమే రామ్మూర్తి నాయుడు జీవితాన్ని రిప్లికా చేశారా? అనేది తెలియాల్సివుంది.